English | Telugu

మార్చి 6నుంచి తెలంగాణ బడ్జెట్ ఫైట్... వాస్తవిక లెక్కలపై సర్కారు కసరత్తు...

మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 31లోపు అప్రాప్రియేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలపాల్సి ఉండటంతో, మార్చి 6నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటిరోజు అంటే మార్చి 6న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. మార్చి 7న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేస్తారు. ఇక, మార్చి 8న 2020-21 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మార్చి 10 నుంచి సాధారణ బడ్జెట్‌, శాఖల వారీగా పద్దులపై చర్చ చేపడతారు. బడ్జెట్ సమావేశాలను మార్చి 23వరకు 14రోజులపాటు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే, సభను ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ మీటింగ్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.

అయితే, ఆర్ధిక మాంద్యం, కేంద్ర నిధుల్లో కోత, తగ్గిన రెవెన్యూ రాబడి కారణంగా వాస్తవిక బడ్జెట్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శాఖల వారీగా సమీక్షలు జరిపి అంచనాలను సేకరిస్తోంది. ఆదాయ-రాబడి-వ్యయ ‌ఖర్చులకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందిస్తోంది. అయితే, గత బడ్జెట్‌తో పోలిస్తే, ఈసారి బడ్జెట్‌ పెరుగుదుల అతి తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, రుణమాఫీ, రైతుబంధు, నిరుద్యోగ భృతి వంటి సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలుకాని నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది.