English | Telugu

మధ్యాహ్నం మోడీతో... రాత్రికి రాష్ట్రపతితో... ట్రంప్ సెకండ్ డే షెడ్యూల్ ఇలా...

మొదటి రోజు అహ్మదాబాద్‌ అండ్ ఆగ్రాలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌... రెండోరోజు మొత్తం ఢిల్లీలోనే గడపనున్నారు. ఈరోజు రాష్ట్రపతి భవన్‌ సందర్శనతో ట్రంప్ సెకండ్ డే టూర్‌ మొదలుకానుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సెకండ్ డే షెడ్యూల్ ప్రకారం ఉదయం 10గంటలకు రాష్ట్రపతి భవన్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత 10-30కి రాజ్‌ఘాట్‌‌కు చేరుకోనున్న ట్రంప్‌-మెలానియా దంపతులు.... ప్రధాని మోడీతో కలిసి మహాత్మాగాంధీ సమాధి దగ్గర నివాళులర్పిస్తారు. అనంతరం, సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాసిన తర్వాత ట్రంప్.. హైదరాబాద్ హౌజ్‌కు బయల్దేరుతారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మోడీ, ట్రంప్ మధ్య అత్యున్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశం జరుగుతుంది. వివిధ అంశాల్లో రెండు దేశాల మధ్య ఒప్పంద పత్రాలపై సంతకం చేసి, ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడుతారు. ఆ తర్వాత యూఎస్ ఎంబసీలో అమెరికా రాయబార సిబ్బందితో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. అనంతరం, ప్రధాని మోడీ ఏర్పాటుచేసే లంచ్‌లో ట్రంప్ దంపతులు పాల్గొంటారు. అక్కడి నుంచి ట్రంప్ ఐటీసీ మౌర్య హోటల్ కు తిరిగి చేరుకుంటారు.

ఇక, రాత్రి 7-30కి రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చే విందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కుటుంబ సమేతంగా పాల్గొంటారు. అనంతరం, రాత్రి 10గంటలకు ట్రంప్, మెలానియా... ఎయిర్ ఫోర్స్ వన్ ప్రత్యేక విమానంలో అమెరికాకు తిరుగు ప్రయాణం అవుతారు.