English | Telugu
శ్రీశైలం డ్యాంకు భారీగా పెరుగుతున్న వరద
Updated : Aug 18, 2025
నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యామ్‌కు భారీవరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్ కు అధికారులు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీనితో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 2,38,237 క్యూసెక్కులు నీరు, అలాగే సుంకేసుల నుంచి 87,158 క్యూసెక్కులు, హంద్రీ నది నుండి 3,750 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.
మొత్తంగా ఇన్ ఫ్లో 3,29,145 క్యూసెక్కులు గా కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 215.8070 టి.ఎం.సి. లు కాగా, ప్రస్తుతం 197.0114 టి.ఎం.సి లుగా ఉంది. ప్రాజెక్ట్ కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 3,70,786 క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు .