English | Telugu

ఏపీలో మున్సిపల్ కమిషనర్ పై లైంగిక ఆరోపణలు.. దాడి చేసిన పారిశుధ్య సిబ్బంది

ఏపీలోని కృష్ణా జిల్లా పెడనలో మున్సిపల్ కమిషనర్‌పైనే పారిశుద్య కార్మికులు దాడికి పాల్పడటం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. పెడన మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఈ ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా పారిశుద్య కార్మికులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. మహిళా పారిశుద్య కార్మికురాలు లంకేశ్వరి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పారిశుద్య కార్మికులు దాడికి పాల్పడ్డారు. ఆ తరువాత వారు మున్సిపల్ కమిషనర్ అంజయ్యపై పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు.

ఇది ఇలా ఉండగా పారిశుద్య కార్మికులు చేస్తున్న ఆరోపణలను కమిషనర్ అంజయ్య ఖండించారు. తనపై కార్మికులు ఎందుకు దాడి చేశారో తనకు అర్థం కావడం లేదన్నారు. తాను మార్నింగ్ చేస్తుండగా వారు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని అంజయ్య పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై పెడన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరోపక్క మున్సిపల్ కమిషనర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ పెడన మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళా కార్మికులు ధర్నాకు దిగారు. అధికారి వేధింపుల నుండి తమను కాపాడాలని... తక్షణమే కీచక కమిషనర్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ధర్నా చేస్తున్నారు.