English | Telugu

ఏపీలో ఫోన్ల ట్యాపింగ్ పై పిల్.. హైకోర్టులో ఈ రోజు విచారణ

ఏపీలో న్యాయమూర్తుల ఫోన్లపై నిఘాపెట్టారని అనుమానాలతో కూడిన వార్తలు వచ్చిన నేపథ్యంలో రాజకీయంగా తీవ్ర కలకలం రేగింది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది. విశాఖపట్నం జిల్లా గోపాలపట్నానికి చెందిన న్యాయవాది నక్కా నిమ్మీగ్రేస్‌ సోమవారం ఈ పిల్‌ దాఖలు చేశారు. ప్రభుత్వంలోని కొందరు రాజకీయ పెద్దల ప్రోద్బలంతో న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా వ్యవహరించారని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్‌, ట్రాకింగ్‌, నిఘా మొదలైన విషయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీల వ్యవహారంపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం తో దర్యాప్తు చేయించాలని, అంతేకాకుండా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులను బాధ్యులను చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆ పిల్ లో అభ్యర్థించారు.

పిటిషనర్ నిమ్మీగ్రేస్‌ తరఫున ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ డి.రమేశ్‌లతో కూడిన ధర్మాసనం ముందు హాజరై న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్‌ చేశారంటూ ఒక ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావించారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని, లేకపోతె ట్యాపింగ్‌కు పాల్పడినవారు సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశముందని శ్రవణ్‌కుమార్‌ న్యాయమూర్తులను కోరారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈరోజు (మంగళవారం) విచారణ చేపడతామని పేర్కొంది.

ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫ్‌ చట్టం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని ప్రకటించాలని ఆ పిల్ లో కోరారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులను వాదించే న్యాయవాదుల ఫోన్‌ నంబర్లను కూడా ట్యాప్‌ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని లాయరు శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. వ్యక్తుల గోప్యతా హక్కును పరిరక్షించాల్సిన అధికారులే దురుద్దేశంతో న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్‌ చేయడం ద్వారా వారిని నిరుత్సాహపరుస్తూ న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయమూర్తులు తీర్పులిచ్చారన్న తప్పుడు భావనలో కొంతమంది అధికారులున్నారని అయన అన్నారు. ఇదే అభిప్రాయంతో ఉన్న కొంతమంది అధికారపార్టీ మద్దతుదారులు ఏకంగా న్యాయమూర్తులను దూషిస్తూ, అసభ్య పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెట్టిన విషయాన్నీ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న శాసనసభ స్పీకర్‌, ఒక పార్లమెంటు సభ్యుడు, మంత్రులు వంటి వారు కూడా న్యాయమూర్తుల పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని అయన తెలిపారు.