English | Telugu

దేశమంతా ఒక రేటు..కర్నూలులో ఒక రేటు.. ఉల్లి ధరలపై లొల్లి

కొండెక్కిన ఉల్లి ధరల్ని కంట్రోల్ చేసేందుకు కేంద్రం మరిన్ని చర్యలను చేపట్టింది. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో లక్ష టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఉల్లి ధరలు దిగి వచ్చే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. మార్కెట్లో ఉల్లి ధర 100 రూపాయలకు చేరుకున్న నేపధ్యంలో ఒక లక్ష టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.

నవంబర్ 15 - డిసెంబరు 15 మధ్య కాలంలో లక్ష టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకొని దేశీయ మార్కెట్ లో పంపిణీ చేయాలని ఎంఎంటీసీని కోరినట్లుగా మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను దేశవ్యాప్తంగా సరఫరా చేయాలని నాఫెడ్ ను ఆదేశించినట్లుగా మంత్రి తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని వాణిజ్య సంస్థ ఎంఎంటీసీ ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటోందని దేశీయ మార్కెట్ లో కీలకమైన నా ఫెడ్ వీటిని సరఫరా చేస్తుందని మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు.

కొండెక్కిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవడంపై సామాన్య మధ్య తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం చర్యలతో కొండెక్కిన ఉల్లి ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కిలో 100 రూపాయలకు చేరుకోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలో కొనాల్సిన వాళ్ళు పావు కిలో.. అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఉల్లి ధరల నియంత్రణలోకి వస్తాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.ఇదిలా ఉంటే కర్నూలు ఉల్లి మార్కెట్ లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఓ వైపు ఉల్లి ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతూ ఉంటే కర్నూల్ మార్కెట్ లో మాత్రం ఉల్లికి డిమాండ్ పడిపోయింది. మార్కెట్ లో ఉల్లి పోటెత్తడంతో డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. వేరే ప్రాంతాల్లో డిమాండ్ ఉన్నా కూడా ఆశించిన స్థాయిలో వ్యాపారులు ఉల్లిని కొనుగోలు చేయటం లేదు. దీంతో వారం రోజులుగా ఉల్లి రైతులు మార్కెట్ లోనే పడిగాపులు గాస్తున్నారు. ఒక పక్క ఉల్లి కుళ్లిపోతుంటే అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉల్లిని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.