English | Telugu

ప్రాణం తీసిన సెల్ఫీ.. బీటెక్ విద్యార్థిని మృతి

స్మార్ట్ ఫోన్.. ఫ్రంట్ కెమెరా.. ఉంటే చాలు కొందరు అమ్మాయిలు పక్కన ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటున్నారు. సెల్ఫీ పిచ్చిలో బ్రతికేస్తున్నారు. బ్రతికితే ఏ బాధ లేదు కానీ.. ప్రాణాలు పొగుట్టుకునేంత వరకు తెచ్చుకుంటున్నారు. ఇక విషయానికి వస్తే.. వరద నీటితో అన్ని నదులు కళకళలాడుతున్నాయి. గలగల పారే కృష్ణా జలాలతో సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో బీటెక్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. సముద్రం, నదులు, వాగుల వద్ద సెల్ఫీలు ఎంత ప్రమాదకరమో గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనతో మరోసారి నిరూపితమైంది.

నరసరావుపేట, వెంగల్ రెడ్డి నగర్ కు చెందిన బీటెక్ విద్యార్థిని ధనలక్ష్మి స్నేహితులతో కలిసి స్నేహితుని పెళ్లి ఉండటంతో కండ్లగుంటకు బయల్దేరింది. అయితే దారిమధ్యలో గుంటూరు బ్రాంచ్ కెనాల్ వంతెన పై తన స్నేహితుడు ముకేష్ తో కలిసి సెల్ఫీ తీసుకోవాలనుకుంది. సెల్ఫీ అలా క్లిక్ మనడం.. ఇద్దరూ కాలువలో పడిపోవటం రెండూ ఒకేసారి జరిగాయి. ఒడ్డున ఉన్న స్నేహితులు వెంటనే అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు పడిపోయిన వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఇందులో ముఖేష్ ప్రాణాలతో బయటపడగా.. ధనలక్ష్మిని ఒడ్డుకు చేర్చేటప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైంది. పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేటలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ధనలక్ష్మి మృతి చెందినట్టు పరీక్షించిన వైద్యులు తెలిపారు. శుభకార్యానికి వెళుతూ కుమార్తె విగతజీవిగా మారడంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.