English | Telugu

జగన్ గారి రౌడీ రాజ్యంలో దళితులకు జీవించే హక్కు లేదా?

ప్రకాశం జిల్లా చీరాలలో ఎస్‌ఐ విజయ్ కుమార్ అత్యుత్సాహంపై దళి సంఘాలు నిరసనకు దిగాయి. ఎస్‌ఐ విజయ్ కుమార్‌ పై హత్య, ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చెయ్యాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అద్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు.

ఈనెల 19న మాస్క్ లేకుండా తిరుగుతున్నాడని కిరణ్‌ కుమార్ అనే యువకుడిని చీరాల టూటౌన్ ఎస్‌ఐ విజయ్ కుమార్ చితకబాదాడు. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గుంటూరు ఆసుపత్రికి తరలించారు. కాగా యువకుడు కిరణ్‌ కుమార్ పరిస్థితి మరింత విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు లాఠీ దెబ్బల కారణంగానే కిరణ్‌ కుమార్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరోవైపు, ఎస్‌ఐ విజయ్ కుమార్ అత్యుత్సాహంపై దళిత సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.

కాగా, నిన్న తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక లారీలు అడ్డుకున్నందుకు దళిత యువకుడు వరప్రసాద్ కి పోలీసులు శిరోముండనం చేసి, తీవ్రంగా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. వైఎస్ జగన్ గారి రౌడీ రాజ్యంలో దళితులకు జీవించే హక్కు లేదా? అని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడు వరప్రసాద్ కి అధికారపార్టీ నేతల మెప్పు కోసం పోలీసులే శిరోముండనం చేయించి చిత్ర హింసలు పెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా లో దళిత యువకుడు కిరణ్ కుమార్ పోలీసుల దాడిలో చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.

దళితులపై జగన్ రెడ్డి ప్రభుత్వ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు ఈ రాష్ట్రంలో శాంతి,భద్రతలు ఉన్నాయా? అని లోకేష్ ప్రశ్నించారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీకి తొత్తుల్లా మారి, గూండాల్లా దళితులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన పోలీసులు,వారి వెనుక ఉన్న అధికార పార్టీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. శిరోముండనం ఘటనపైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని లోకేష్ డిమాండ్ చేశారు.