English | Telugu

కరోనా నేపథ్యంలో జనగణన వాయిదా! హొంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్‌1 నుంచి కేంద్రం చేపట్టాలనుకుంటున్న ఎన్‌పిఆర్‌ను వాయిదా వేస్తున్నామని కిషన్‌రెడ్డి ప్ర‌క‌టించారు. కరోనా నివారణకు కేంద్రం అన్నిచర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాల్లో పర్యవేక్షణ కోసం జాయింట్ సెక్రటరీలను నియమించామని తెలిపారు. జనవరి 26 నుంచి అన్ని విమానాశ్రయాల్లో పరీక్షలు ప్రారంభించామని పేర్కొన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలలో సామూహిక ప్రార్థనలు సాధ్యమైనంత వరకు తగ్గించాలని కోరారు.

కరోనా అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఓడల ద్వారా వచ్చే సరకు రవాణాను నిషేధించామని వెల్లడించారు. విదేశాల్లో ఉన్న రాయబారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని తెలిపారు. దేశ సరిహద్దుల్లో కట్టుదిట్టుమైన నిఘా పెట్టామని తెలిపారు. మనీలాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

క‌రోనా నేప‌థ్యంలో నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్పీఆర్‌) ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన నమూనాతో ఎన్పీఆర్ వివరాలను సేకరించాల్సిందిగా రాష్ట్రాల‌కు సూచించిన కేంద్రం.. ఆ ప్రశ్నలను చట్టంలోని ఏ సెక్షన్‌ ప్రకారం చేర్చిందో మాత్రం స్పష్టతనివ్వలేదు. ఒకవైపు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ).. వివాదాస్పదమైన నేపథ్యంలో తాజాగా ఎన్పీఆర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంతో ఈ అంశంపై వున్న వివాదంపై కొంత కాలం వ‌ర‌కు తెర‌ప‌డిన‌ట్లే.