English | Telugu

తెలంగాణలో మరో సంగ్రామం... మోగిన మున్సిపోల్స్ నగారా

తెలంగాణలో మరో ఎన్నికల సంగ్రామానికి నగారా మోగింది. సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియరైంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కూడా చర్యలను వేగవంతం చేయడంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం... మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ప్రస్తుతం 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 7న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, జనవరి 8 నుంచి 10వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. అదేవిధంగా తిరస్కరించిన నామినేషన్లపై జనవరి 12, 13 తేదీల్లో అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. ఇక, నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 14వరకు గడువు ఇచ్చారు. జనవరి 22న పోలింగ్ నిర్వహించి... జనవరి 25న ఫలితాలఅను వెల్లడించనున్నారు. అయితే, మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

అయితే, మున్సిపల్ ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించడం... అలాగే, ఎన్నికల హామీల్లో చాలా వరకు ఇంకా అమలు చేయకపోవడం... మరోవైపు విపక్షాలు కూడా మున్సిపోల్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో... ఈసారి ఏకపక్ష ఫలితాలు వచ్చే అవకాశమే లేదంటున్నారు విశ్లేషకులు.