English | Telugu

జగన్ 3 రాజధానుల నిర్ణయం పట్ల బీజేపీ నేతల విభిన్న వ్యాఖ్యలు .....

ఏపీ సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటనతో బిజెపిలో రాజకీయ దుమారం మొదలైంది. పార్టీ ఏపీ నేతలలో ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేయటంతో కేడర్ అయోమయంలో పడింది అంటున్నారు. పార్టీ ముఖ్యనేతలు రోజుకో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రకటన వెలువడిన తొలి రోజు విష్ణువర్ధనరెడ్డి, జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మినారాయణ, మాధవ్ లాంటి నేతలు కాస్త అటు ఇటుగా జగన్ నిర్ణయాన్ని దాదాపుగా సమర్ధించినట్టే మాట్లాడారు. కానీ ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతున్నారు. రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదనను ముఖ్యమంత్రి వైయస్ జగన్ అసెంబ్లీలో ప్రస్తావించగానే పెను దుమారం చెలరేగింది. తెలుగుదేశం పార్టీ ఆగ్రహించింది, జనసేన పార్టీ మండి పడింది, వామపక్షాలు భగ్గుమంటున్నాయి, కానీ భారతీయ జనతా పార్టీ లోనే తీవ్ర గందరగోళం కనిపిస్తోంది.తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళి మాత్రం వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు.

దాని వెనుక బలమైన కారణాలున్నాయి. వారు ఏదో ఒక కారణం వెతుక్కొని వైసీపీ లోకి వెళ్లాలని చూస్తున్నారనే టాక్ ఉందని సమాచారం. కానీ బిజెపి నేతలకు ఏమయిందని ఇప్పుడు పార్టీ లోనే చర్చ మొదలైంది. బీజేపీలో జగన్ ప్రకటనపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మూడు రాజధానుల కాన్సెప్ట్ ని తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ సీనియర్ నేత ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. తాను గతంలోనే మూడు రాజధానుల విషయమై ఊహించానని ఆ ఊహలకు తగ్గట్టు గానే జగన్ నడుచుకుంటున్నారని సెలవిచ్చారు జీవీఎల్. ఇలా బీజేపీలో మూడు రాజధానుల విషయమై భిన్న స్వరాలు వినిపిస్తుండటం గమనార్హం. బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అయితే మూడు రాజధానుల విషయంలో జగన్ ను ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మూడు రాజధానుల వ్యవహారంతో బీజేపీని వైఎస్ఆర్సిపి చాలా గట్టిగా దెబ్బకొట్టినట్లే కనిపిస్తుందటున్నారు. టీజీ వెంకటేష్ ఇప్పటికే వైసీపీతో టచ్ లోకి వెళ్లారంటున్నారు.

సుజనా చౌదరి మాత్రం ఈ వ్యవహారంలో చంద్రబాబును వెనకేసుకొస్తున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి అంటున్నారు. జీఎన్ రావు కమిటీ అనేకంటే దాన్ని జగన్ మోహన్ రెడ్డి కమిటీ అంటే బావుంటుందని వ్యాఖ్యానించారు. అంతకుముందు అదే విష్ణువర్దన్ రెడ్డి జగన్ నిర్ణయానికి మద్దతు పలికారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కమిటీ నివేదికలు ఉన్నాయా అన్నది ఆయన వాదన. టిడిపిని గందరగోళంలో నెట్టడానికి జగన్ ప్రకటన ఉంది తప్ప ప్రజలకు ఉపయోగపడేలా లేదంటున్నారు. హైకోర్టును కర్నూలులో పెట్టమంటే నాడు చంద్రబాబు వినలేదు, రాష్ట్రాన్ని ఫుట్ బాల్ ఆడుకున్నారని విష్ణు వ్యాఖ్యానించడం విశేషం. హైకోర్ట్ రావడం వల్ల కొత్తగా కర్నూలుకి మహా అయితే నాలుగు జిరాక్స్ మిషన్ లు నాలుగు న్యాయవాదుల భవనాలు తప్ప ఇంకే లాభం లేదంటున్నారు ఆయన. ఇక బీజేపీలో ఏ ప్రాంత నాయకుడు ఆ ప్రాంతానికి అనుగుణంగా మాట్లాడుతున్నారు. దీంతో పార్టీ కేడర్ లో గందరగోళం ఏర్పడింది. మరో పక్క ఇదంతా పార్టీ వ్యూహంలో భాగంగానే చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏ ప్రాంతంలోనూ పార్టీ బలహీన పడకూడదనుకుంటే ఇలాంటి వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించాకే ఈ ప్రకటనలు చేస్తున్నారని జనాలు అభిప్రాయపడుతున్నారు..