మహారాష్ట్రలోని శివసేన సర్కార్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చిన కంగనా రనౌత్ ఇప్పటికే అక్కడి అధికార శివసేన పార్టీ తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ నేపథ్యంలో కంగనా సెప్టెంబర్ 9 న ముంబై చేరుకుంటానని స్వయంగా సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చింది. ఇదే సందర్భంలో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ను కూడా కంగనా సవాలు చేసింది. దీంతో ఆమె ముంబై చేరుకుంటే ఎం జరుగుతుందోనని జనాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఆమె ముంబై చేరుకున్న తరువాత ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం కంగనా రనౌత్‌ను 7 రోజుల పాటు క్వారంటైన్ పేరుతో నిర్బంధించవచ్చని వార్తలు వస్తున్నాయి. దీని ప్రకారం, ముంబై చేరుకున్న కంగనా రనౌత్‌ను 7 రోజుల పాటు నిర్బంధించడానికి బిఎంసి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ రూల్స్ ప్రకారం, ఎయిర్ లైన్స్ ద్వారా ముంబైలోకి ఎవరైనా ప్రవేశిస్తే వారిని తప్పకుండా క్వారంటైన్ లో ఉంచాలి. ఇప్పటికే సుశాంత్ కేసు దర్యాప్తుకు వచ్చిన బీహార్ ఐపిఎస్ అధికారి వినయ్ తివారీని కూడా బిఎంసి ఇలాగే నిర్బంధించింది. ఇక కోవిడ్ ప్రోటోకాల్ కింద ముంబైకి వచ్చే వ్యక్తి 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలి.