English | Telugu

వైసీపీలోకి గంటా ప్రవేశం డేట్ ఫిక్స్.. విశాఖలో టీడీపీ పరిస్థితి..? 

విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నారంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అయనను పార్టీలో చేర్చుకోవడం పై ఎంపీ విజయ్ సాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ అభ్యంతరం చెప్పడంతో గంటా చేరిక ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జగన్ ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ పట్టు కోసం అధికార పార్టీ వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంట్లో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ రంగం సిద్ధం అయింది. అక్టోబర్ 3న సీఎం జగన్‌తో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భేటీ కానున్నట్లుగ వార్తలు వస్తున్నాయి. అదే రోజు అయన జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం గంటా నేరుగా సీఎం జగన్‌తోనే మాట్లాడుకొని తన చేరికకు ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది. వైసీపీలో చేరిన తర్వాత ఆయనకు వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ పదవి కూడా ఇవ్వవచ్చని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.

2019 ఎన్నికలలో రాష్ట్రం మొత్తం వైసీపీకి జై కొట్టగా విశాఖలోని నాలుగు నియోజకవర్గాలలో మాత్రం టీడీపీ విజయం సాధించింది. దీంతో విశాఖలో పట్టు కోసం అధికార వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దక్షిణ నియాజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సైలెంట్ గా సీఎం జగన్ కు జై కొట్టగా.. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు కూడా అధికార పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతూన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో నగరంలో ఇక మిగిలింది తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ మాత్రమే. ఆయన కృష్ణ జిల్లా వాసి మాత్రమే కాక కరుడుగట్టిన టీడీపీ నాయకుడు. అయితే ఆయనను కూడా వైసిపిలోకి తీసుకురావడానికి మంత్రి కొడాలి నాని, ఇప్పటికే పార్టీ మారిన వల్లభనేని వంశీ, కరణం బలరాం తదితరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆయన మాత్రం ఇంకా వైసీపీ అధిష్ఠానానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదని సమాచారం.