English | Telugu
రేసులోకి దూసుకొచ్చిన డీకే అరుణ... అన్నీ కలిసొస్తే పార్టీ పగ్గాలు ఆమెకే...
Updated : Dec 21, 2019
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలిగా, మంత్రిగా ఒక వెలుగు వెలిగిన డీకే అరుణ... బీజేపీలో చేరిన తర్వాత సైలెంట్ అయిపోయారు. అయితే, బీజేపీలో చేరినప్పుడు ఏదో ఒక పదవి ఇస్తామంటూ హామీ ఇచ్చారని అంటారు. కానీ, రోజులు గడిచిపోతున్నా ...ఏ పదవి ఇవ్వకపోవడంతో మళ్లీ పాత గూటికి వెళ్లాలని ఆలోచన కూడా చేశారు. అయితే, చాలా రోజులుగా మౌనం దాల్చిన డీకే అరుణకు సడన్ గా ఏమైందో ఏమో తెలియదు గానీ ఒక్కసారిగా సూపర్ యాక్టివ్ అయ్యారు. మహిళా సమస్యలపై పోరుబాట పట్టారు. ముఖ్యంగా దిశ ఘటన తర్వాత మహిళల కోసం ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. దిశ కుటుంబ సభ్యులను పరామర్శించడమే కాకుండా, ఆసిఫాబాద్ జిల్లాలో అత్యాచారం, హత్యకు గురైన సమత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు.
అయితే, దిశ, సమత, మానస హత్యాచారాలకు మద్యమే ప్రధాన కారణమన్న ఆరోపణలు రావడంతో మహిళా మోర్చా ఆధ్వర్యంలో మద్యానికి వ్యతిరేకంగా రెండ్రోజులపాటు నిరాహారదీక్ష చేపట్టి వార్తల్లో నిలిచారు. అంతేకాదు, మహిళలపై పెరుగుతున్న నేరాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించి అందరి దృష్టినీ ఆకర్షించారు. అయితే, మొన్నటివరకు మౌనంగా ఉన్న డీకే అరుణ.... సడన్ గా యాక్టివ్ కావడానికి కారణాలేంటన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఆందోళనలు చేపట్టడం... మీడియాలో ఎక్కువగా కనిపించడం వెనుక మతలబు ఏంటని మాట్లాడుకుంటున్నారు.
అయితే, డీకే అరుణ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై కన్నేసిందనే మాట వినిపిస్తోంది. బీసీ నినాదంతో మళ్లీ లక్ష్మణ్ నే తిరిగి అధ్యక్షుడిగా కొనసాగిస్తారని ప్రచారం జరుగుతున్నా... ఒకవేళ మార్చాలనుకుంటే మాత్రం తనకే ఇవ్వాలని డీకే అరుణ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అందరినీ దృష్టిని తనవైపు తిప్పుకునేందుకు, అలాగే ఢిల్లీ పెద్దల దృష్టిలో పడేందుకే సడన్ గా పోరుబాట పట్టి హడావిడి చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే, రేసులో లక్ష్మణే ముందు ఉన్నప్పటికీ, ఆ తర్వాత డీకే అరుణ పేరే ప్రధానంగా వినిపిస్తోందని అంటున్నారు. అంతేకాదు, ఒకవేళ లక్ష్మణ్ ను గానీ కొనసాగించకపోతే, తెలంగాన బీజేపీ పగ్గాలు డీకే అరుణ చేతికే దక్కుతాయనే చర్చ నడుస్తోంది. మహిళా నాయకురాలు కావడం... అదే సమయంలో బలమైన సామాజికవర్గానికి చెందడం.... అలాగే సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉండటంతో... టీఆర్ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా ముందుకెళ్లే స్వభావముండటం కలిసి వస్తాయని డీకే అరుణ భావిస్తున్నారు. మరి, డీకే అరుణ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో కాలమే చెప్పాలి.