English | Telugu

వినూత్న ఆలోచనతో జగిత్యాల జిల్లా కలెక్టర్ 'మంకీ ఫ్రూట్ ట్రీస్'...

హరితహారంలో మొక్కలు అందరూ నాటుతున్నారు. అయితే అందులో కొత్త దనాన్ని వెతికేది కొందరే ఉంటారు.వానలు వాపస్ రావాలి కోతులు వాపస్ పోవాలి ఇది హరితహారంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పదేపదే చెప్పే మాట. వానలు రావాలంటే మొక్కలు నాటితే సరిపోతుంది. మరీ కోతులు వాపస్ పోవాలంటే ఏం చేయాలి అని అలోచించిన జగిత్యాల జిల్లా యంత్రాంగాం ఒక వినూత్న ఆలోచన చేసింది. అక్కడ ఉన్న వానర సైన్యాన్ని చూస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో అవి చేసే చేష్టలు చాలా దారుణంగా ఉంటాయి. ఇళ్లల్లోకి చొరబడి ఆహారాన్ని ఎత్తికెళ్తాయి, ఇల్లు పీకి పందిరి వేస్తాయి, ఇటీవల అడవిలో కంటే ఎక్కువగా ఊర్లలోనే ఉంటున్నాయి. వానలు రావటానికి మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మొక్కలు నాటితే వర్షాలు వాపస్ వస్తాయేమో కానీ కోతులు వాపస్ పోవు కదా. మాములుగా నాటే మొక్కల వల్ల కోతులకు ఆహారం దొరకదు కదా అందుకే ఎన్ని మొక్కలు నాటిన కోతుల బెడద మాత్రం ప్రజలకే తప్పటంలేదు.

జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ వినూత్న ఆలోచనతో కోతులు కోసం మంకీ ఫ్రూట్ ట్రీస్ ఏర్పాటు చేయిస్తున్నారు. ఇందుకు వంద బ్లాకుల గుర్తింపు జరిగింది. ఒక్కో బ్లాక్ లో మూడు వేల చెట్లు పధ్నాలుగు రకాల పళ్ల మొక్కలు నాటే ఏర్పాటు చేశారు. అలా జగిత్యాల జిల్లా యంత్రాంగం కోతులు వాపస్ పోవటానికి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా వంద మంకీ బ్లాక్ లను గుర్తించి వాటి కోసం పళ్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే యాభై అటవీ బ్లాకులు మరో యాభై రెవిన్యూ పరిధిలోని బయట స్థలాల్లో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మంచి కార్యక్రమం అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అంటున్నారు. వర్షాలు వాపస్ తెప్పించి కోతులు వాపస్ పంపుతామని అంటున్నారు. జగిత్యాల జిల్లాలో మొదటిసారి పెద్ద మొత్తంలో వన పండ్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. కోతులు తినే పధ్నాలుగు రకాల మొక్కలను ఇప్పటికే తెప్పించారు. మరీ జిల్లా యంత్రాంగం చేసిన ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.