English | Telugu

కాచిగూడ రైల్ యాక్సిడెంట్ ఫుల్ రిపోర్ట్ :- ఇదెలా జరిగిందంటే...

నిన్న ( నవంబర్ 11న ) కాచిగూడ రైల్వే స్టేషన్ లో జరిగిన రైలు ప్రమాదంలో మరమ్మతులు వేగవంతం చేశారు రైల్వే అధికారులు. పూర్తిగా దెబ్బతిన్న రైలు కోచ్ లను భారీ యంత్రాల సాయంతో తొలగించేందుకు 500 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. రైలు ప్రమాదంపై ఇంజినీరింగ్, సిగ్నలింగ్, టెక్నికల్ డిపార్ట్ మెంట్ లకు చెందిన ఆరుగురు ఉన్నతాధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వేశాఖ ఏజీఎం బిబి సింగ్ తెలిపారు. ఎంఎంటీఎస్ కు సిగ్నల్ ఇవ్వలేదని తమ ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు.

కర్నూల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే హంద్రీ ఎక్స్ ప్రెస్ లెవెల్ క్రాసింగ్ వద్దకు వచ్చింది. రెండో నెంబరు ప్లాట్ ఫామ్ కు వెళ్ళే ట్రాక్ లో సిగ్నల్ కోసం ఆగింది. ఐదు నిమిషాల తర్వాత నాలుగో నెంబర్ ప్లాట్ ఫామ్ కు వెళ్లాలంటూ సిగ్నల్ వచ్చింది. అదే సమయంలో లింగంపల్లి నుంచి ఫలక్ నామాకు వెళ్లే ఎంఎంటీఎస్ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రెండో నెంబరు ప్లాట్ ఫాంకు చేరుకుంది. ప్రయాణికులు ఎక్కిన తరువాత సిగ్నల్ రావడంతో 10 నిమిషాల 35 గంటలకు బయలుదేరింది. అటు రెండో నెంబరు ట్రాక్ నుంచి నాలుగో నెంబర్ ట్రాక్ లోకి 20 కిలోమీటర్ల వేగంతో హంద్రీ ఎక్స్ ప్రెస్ వస్తుంది. రెండో నెంబర్ ప్లాట్ ఫామ్ నుంచి బయలుదేరిన ఎంఎంటీఎస్ 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. సరిగ్గా ట్రాక్ చేంజ్ క్రాసింగ్ వద్ద రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఢీ కొట్టిన తరువాత మూడు సెకన్లలోనే ఎంఎంటీఎస్ కు చివర ఉన్న బోగీలు ఎగిరి పక్కకు పడ్డాయి. ఈ ఘటన కాచిగూడ స్టేషన్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు రైళ్లలో ప్రయాణిస్తున్న 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎంఎంటీఎస్ లో 360 మంది వరకు ప్రయాణిస్తూండగా.. హంద్రీలో 1000 నుంచి 1300 ల మంది వరకు ఉన్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.ప్రమాదంలో ఎంఎంటీఎస్ బోగీలు నుజ్జు నుజ్జయ్యాయ. మొత్తం 9 బోగీలతో రైలు బయలుదేరగా లోకోపైలట్ శేఖర్ ఉన్న బోగి ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్యాబిన్ భాగంలో లోకో పైలెట్ కూరుకుపోయాడు. ఎంఎంటీఎస్ బోగీలు రెండు నుంచి మూడు అడుగుల వరకు ఎగిరిపడ్డాయి. మూడు బోగీలు పట్టాలపై నుంచి ఎగిరి పక్కకు పడ్డాయి. ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఇక డీజిల్ ఇంజన్ తో వస్తున్న హంద్రీ ఎక్స్ ప్రెస్ ఇంజిన్ తో సహా 18 బోగీలు పట్టాలు తప్పాయి. ఎంఎంటీఎస్ 50 కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చి ఢీకొనడంతో ఐదు నుంచి ఏడు ఇంచుల వరకూ హంద్రీ ఎక్స్ ప్రెస్ లోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.

కాచిగూడ రైల్వే స్టేషన్ ద్వారా వచ్చే రైళ్లను దారి మళ్లించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి పై గవర్నర్ తమిళ శాయి ఆరా తీశారు. ఉస్మానియా సూపర్ అటెండెంట్ నాగేందర్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంఎంటీఎస్ బోగీలు కొత్తవి కావడం.. వాటికి యాంటీ క్లయింబింగ్ సిస్టం ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఢీ కొనగానే ఎంఎంటీఎస్ రైలుకు చెందిన 3 బోగీలు పట్టాలు తప్పాయి.

కొత్త బోగీలకు ఉన్న యాంటీ క్లయింబింగ్ సిస్టమ్ వల్ల భూగీలు గాల్లోకి ఎగిరినా కింద పడలేదని అధికారులు చెబుతున్నారు. అదే పాత బోగీలతో కూడిన రైలింజన్ ఢీకొని ఉంటే ఎదుటి రైలుపై బోగీలు ఎక్కి ఉండేవని వివరించారు. ప్రమాదంపై హంద్రీ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ డ్రైవర్ బాలకృష్ణయ్య స్పందించారు. సిగ్నల్ వద్ద తమ రైలును నిలుపుతూ ఉండగా ఎంఎంటీఎస్ వేగంగా వచ్చి ఢీకొట్టింది అని ఎమర్జెన్సీ బటన్ నొక్కినా కూడా చూసుకోకుండా వేగంగా వచ్చి ఢీకొట్టింది అని తెలిపారు. ఎంఎంటీఎస్ మరింత వేగంగా ఉండి ఉంటే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండేదని ఆయన తెలిపారు. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఎంఎంటీఎస్ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన లోకోపైలట్ శేఖర్ ను బయటకు తీయడానికి ఏడున్నర గంటలు పట్టింది. క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జవడంతో దానిలో ఇరుక్కుపోయిన శేఖర్ కనీసం కాళ్లు చేతులు కదిపే పరిస్థితి కూడా లేకపోవడంతో ఆయనకు శ్వాసకు ఇబ్బంది రాకుండా ఆక్సిజన్ అందించారు. రెండు సెలైన్ బాటిల్ ను ఎక్కించారు.

ఎలక్ట్రికల్ కట్టర్లూ రంపాలతో బోగీని కట్ చేసి ఏడున్నర గంటల రిస్క్ ఆపరేషన్ తర్వాత పైలెట్ ను బయటకు తీశారు. అనంతరం నాంపల్లి లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. మృత్యుంజయుడిగా బయట పడిన శేఖర్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసి. ఆయనకు ముఖం, దవడ వద్ద ఎముకలు విరిగిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతూ ఉంటాయని.. సాంకేతిక లోపాల వల్లే ఈ తప్పిదాలు జరుగుతూ ఉంటాయని.. రానున్న రోజుల్లో ఎలాంటి తప్పిదం జరగకుండా చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.