English | Telugu
ధారావి.. కరోనా కట్టడిలో శెభాష్
Updated : Jul 14, 2020
నిన్న హట్ స్పాట్..
నేడు రోల్ మోడల్..
కరోనా కట్టడిలో శెభాష్...
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడ. రెండున్నర చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో జనాభా దాదాపు పదిలక్షలు. అంతా వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి వెతుకుంటూ వచ్చిన వారే. అక్కడి ప్రజలకు కమ్యూనిటీ టాయ్లేట్లు తప్ప వ్యక్తిగత మరుగుదొడ్డి సదుపాయం కూడా లేదు. అలాంటి ప్రాంతంలో సోకిన కరోనాను సమర్థవంతంగా అరికట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెప్పు పొందింది. కరోనాను సమర్థంగా నివారించడంలో ధారావి, ఇటలీ, సౌత్ కొరియా, స్పెయిన్ లు చాకచక్యంగా పనిచేశాయని, వైరస్ ను అదుపు చేశాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ ట్రెడోస్ అధనామ్ గెబ్రెసస్ అభినందించారు.
జనసామర్ధ్యం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఏప్రిల్ 1న మొదటికేసు నమోదు కావడంతో ముంబాయి ఉలిక్కి పడింది. ఇక్కడి వ్యాప్తిని అడ్డుకోవడం సవాల్ గా తీసుకున్న ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్ యుద్ధ ప్రాతిపదికన పరిస్థితిని చక్కదిద్దేందుకు సమాయత్తం అయ్యింది. టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్, ట్రీట్మెంట్ అందించడం వంటి విధానాలు అనుసరిస్తూ కమ్యూనిటీకి సోకకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. దాంతో కరోనా పాజిటివ్ కేసులు వేలల్లోకి చేరినా వేగంగా అదుపులోకి వచ్చింది.
మొదటి కేసు నమోదు కాగానే వేగంగా, కఠినంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ప్రాంతమంతా కంటైన్మెంట్ చేయడంతో పాటు లౌడ్‌స్పీకర్ లలో ప్రజలను అప్రమత్తం చేశారు. అధునాతన డ్రోన్ కెమెరాల ద్వారా ప్రజల కదలికలపై నిఘా ఉంచారు. సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వలస కార్మికులను ప్రత్యేక శ్రామిక్ రైళ్లు, బస్సుల ద్వారా వారి సొంత ఊర్లకు పంపించారు. జన సాంద్రతను తగ్గించి ప్రతి ఇంటి పరిస్థితిని సమీక్షించారు.
ప్రజల వద్దకే వైద్యశాఖ
కోవిద్ యోధులు అన్న పేరుతో వాలెంటీర్లను నియమించి వారి ద్వారా ప్రజలకు కావల్సిన భోజన, నిత్యావసర సదుపాయాలు అందించారు. కమ్యూనిటీ మరుగుదొడ్డను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ డిస్ ఇఫెక్షన్ మందులు చల్లారు. ప్రజల వద్దకే వైద్యశాఖ తరలివెళ్ళింది. ప్రైవేట్ వైద్యులు ముందుకు వచ్చారు. వైద్యసిబ్బందికి, వాలెంటీర్లకు పిపిఇ కిట్లు, థర్మల్ స్కానర్లు, పల్స్ ఆక్సిమెట్రేస్, మాస్క్‌లు, గ్లౌజులు అందించింది. రిస్క్ జోన్లలో ఇంటింటికి స్క్రీనింగ్ ప్రారంభించింది. ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారి ఇంటిని ఐసోలేషన్ చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ ఎవరికైనా వైద్య సహాయం అవసరమైతే వారికి ఆసుపత్రికి తరలించారు. వారి కోసం ప్రత్యేకంగా 14రోజుల్లో రెండువందల పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. పూర్తి వైద్యసిబ్బందితో పాటు వెంటిరేటర్ సదుపాయాలు కూడా సమకుర్చారు. బస్తీలోని 47,500 మందికి డాక్టర్లు, ప్రైవేట్ క్లినిక్ సిబ్బంది స్క్రీనింగ్ నిర్వహించారు. 14,970 మందిని మొబైల్ వ్యాన్స్‌లో స్క్రీనింగ్ చేశారు. మొత్తం మీద 4,76,775 మంది ప్రజలకు బీఎంసీ హెల్త్ వర్కర్స్ సేవలందించారు. దాంతో కేసుల సంఖ్యలు బాగా తగ్గిపోయాయి. కరోనా సోకిన వారిలో దాదాపు 90శాతం మందికి ఇంటి వద్దనే చికిత్స అందించారు. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకున్నారు.
వేలాది కోట్ల టర్నోవర్..
ధారావి అతి మురికి వాడగానే ప్రపంచానికి తెలుసు. అయితే భారతదేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబాయిలో ధారావి నుంచి ప్రతి ఏడాది వేలాది కోట్ల టర్నోవర్ జరుగుతుంది.
ఇక్కడ జిఎస్టి చెల్లించే కంపెనీలు 5000 వరకు ఉన్నాయి. చిన్నచిన్న కంపెనీలు అంటే ఒక రూంలోనే నిర్వహించబడే పరిశ్రమలు 15000వరకు ఉంటాయి. ఇక్కడి టెక్స్ టైల్ పరిశ్రమలు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ ఎగుమతి చేస్తాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మెప్పు పొందిన ఇక్కడి ప్రజలు అతి త్వరలోనే తమ ఉపాధి అవకాశాలను తిరిగి పొందుతారని ఆశిద్దాం.