English | Telugu
మాస్క్‌ల ధరలకు రెక్కలు వచ్చాయి!
Updated : Mar 4, 2020
నగరంలో మాస్క్‌ల కృత్రిమ కొరత
హైదరాబాద్‌లోని 80 శాతం మెడికల్ షాప్‌లలో మాస్క్‌లు లేవు.
ఎక్కువ ధరకు అమ్ముతూ ప్రజల్ని దోచుకుంటున్న మందులషాపులు.
ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల వద్ద మాస్కులకు విపరీత డిమాండ్
హైదరాబాద్ మెడికల్ షాప్‌లలో మాస్క్‌ల కొరతపై తెలుగు వన్ టీం గౌండ్ రిపోర్ట్.
హైదరాబాద్ నగర ప్రజలకు కరోనా వైరస్ భయంపట్టుకుంది. మాస్క్‌లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అందుకేనేమో మాస్క్‌ల ధరలకు రెక్కలొచ్చాయి. వైరస్ సోకకుండా వుండడానికి మాస్క్‌ల ధరించాలన్న ఉద్దేశంతో చాలా మంది మాస్క్‌లకు ఎగబడుతున్నారు.
ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్న మెడికల్ షాప్‌లలో మాస్క్ కొనడానికి వెళ్ళిన తెలుగువన్ టీంకు చేదు అనుభవం ఎదురైంది. మొత్తం 38 షాపుల్లో కేవలం 7 షాపుల్లోనే మాస్క్‌లు దొరికాయి. మిగతా 31 మెడికల్ షాప్‌లలో స్టాక్ లేదని సమాధానం.
మాస్క్‌లు, శానిటైజర్‌లు తక్కువ మోతాదులో సేల్ అయ్యే ఐటమ్స్ కాబట్టి జనరల్‌గా మెడికల్ షాపుల్లో స్టాక్ తక్కువగా వుంటుందని మెడికల్ షాప్ నిర్వాహకులు చెబుతున్నారు. షాప్‌కు వచ్చే 10 మంది కస్టమర్లలో 9 మంది మాస్క్‌లనే అడుగుతున్నారట! 50 రూపాయలైనా ఇస్తాం. మాస్క్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నా ఇవ్వలేకపోతున్నామంటున్నారు మెడికల్ షాప్ నిర్వాహకులు.
ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రికి కిలోమీటర్ పరిధిలో వున్న 8 పెద్ద మెడికల్ షాపుల్లో ఆరు మెడికల్ షాపుల్లో స్టాక్ లేదన్నారు. మెడ్‌ప్లస్ అమీర్‌పేట లాల్‌బంగ్లా బ్రాంచ్ బయట నో స్టాక్ బోర్డే పెట్టేశారు. రెండు షాప్‌లలో సాదారణ మాస్క్‌ను 20 రూపాయలకు సేల్ చేశారు.
గాంధీ ఆసుపత్రి చుట్టుపక్కల 15 మెడికల్ షాప్‌లలో కేవలం నాలుగు చోట్ల మాత్రమే మాస్క్‌లు దొరికాయి.
ఉస్మానియా ఆసుపత్రి సమీపంలోని 15 మెడికల్ షాప్‌లలో మాస్క్ కొనడానికి వెళ్ళిన మా టీంకు విచిత్రమైన అనుభవం కలిగింది. మధ్యనిషేధం వున్నప్పుడు రహస్యంగా బ్లాక్‌లో మందు అమ్మినట్లు ఇప్పుడు మెడికల్ షాప్ బయట బ్లాక్‌లో మాస్క్‌లు అమ్ముతున్నారు.
ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కొంత మంది మందుల షాపుల నిర్వాహకులు
వాటి ధరలను అమాంతం పెంచేసి విక్రయిస్తున్నారు. నిన్నటిదాకా రిటైల్‌గా ఐదు రూపాయలు, హోల్‌సేల్‌లో రూపాయి 60 పైసలు విలువ చేసే రెండు లేయర్ల మాస్క్ ధర ఇప్పుడు 20 నుంచి 25 రూపాయలకు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తున్నారు. 40 రూపాయలు విలువ చేసే ఎన్ 95 మాస్క్‌ను 300 రూపాయలకు విక్రయిస్తున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
తక్కువ ధరకు లభించే జనరిక్ మందుల షాపుల్లోనూ మాస్క్ ధర అమాంతం పెరిగిపోయింది. ఒక్కో మాస్కును 15 నుంచి 20 రూపాయలకు విక్రయిస్తున్నారు. గతంలో వంద మాస్కుల ప్యాకెట్ 160 రూపాయలుంటే ఇప్పడది ఏకంగా 1600 రూపాయలకు పెరిగింది.
ప్రస్తుత డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హోల్‌సేల్ అమ్మకందార్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. స్టాక్ ని దాచి పెట్టి తర్వాత ఎక్కువ రెట్లు పెట్టి అమ్ముకోవచ్చనే ఆలోచనలతో కొంత మంది మెడికల్ షాపుల నిర్వాహకులున్నారు. సానిటైజర్ లు అయితే అసలు లేవని చెప్పేస్తున్నారు. అయితే నిజంగా స్టాక్ లేదా? లేక కృత్తిమ కొరత సృష్టించి దోచుకుంటున్నారా?
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే పరిస్థితి ఇంత దారుణంగా వుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? కృత్రిమ కొరత సృష్టించి మెడికల్ షాప్‌ల నిర్వాహకులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని జనం బెంబేలెత్తుతున్నారు. ఇప్పట్టికైనా ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించి ప్రజలకు అవసరమైన మాస్క్‌లను అందుబాటులో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.