English | Telugu
రాజధానిని మార్చే అధికారం ఎవరిచ్చారు?.. ఎప్పటికైనా అమరావతే రాజధాని!
Updated : Dec 27, 2019
ఏపీ రాజధాని వివాదం గురించి ప్రతిపక్ష నేత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. రాజధానిని మార్చే అధికారం ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో రాజధాని మార్పు ఎక్కడా జరగలేదని తెలిపారు. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు, కుప్పం నుంచి తడ వరకు అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండేలా రాజధానిని ఏర్పాటు చేశామని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యంగా రాజధానిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు చేశాం.. విశాఖను ఐటీ, ఫార్మా హబ్‌గా అభివృద్ధి చేయాలనుకున్నామని వివరించారు. విశాఖపై మీకు ప్రేమ ఉంటే డేటా సెంటర్‌ను ఎందుకు రద్దు చేశారని జగన్ సర్కార్ ని ప్రశ్నించారు. ఆదానీ గ్రూప్ వచ్చి ఉంటే నాలుగైదు ఏళ్లలో విశాఖ హైదరాబాద్‌కు సమానంగా అభివృద్ధి చెందేది అన్నారు.
ఓ కంపెనీని తేవడం చాలా కష్టం, వెళ్లగొట్టడం ఈజీ అని విమర్శించారు. అంతర్జాతీయ కంపెనీ లులుని కూడా వెళ్లగొట్టారని, ఆ కంపెనీకి కేటాయించిన భూములు కొట్టేద్దామనుకున్నారా? అని చంద్రబాబు మండిపడ్డారు. బోగాపురంలో 2వేల ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూసేకరణ చేస్తే దానికి కూడా అడ్డుపుల్లలు వేశారని విమర్శించారు. అమరావతికి బోలెడు ఖర్చవుతుందని, అంత డబ్బులతో రాజధాని కట్టలేమని ప్రభుత్వం చెప్పడం సాకు మాత్రమేనని చంద్రబాబు ఆరోపించారు. అన్ని అవసరాలు పోగా 10 వేల ఎకరాల భూమి ప్రభుత్వం వద్ద ఉంటుందని తెలిపారు. ఈ భూమిని అమ్మగా వచ్చిన డబ్బుతో మహానగరం నిర్మించవచ్చని చెప్పారు. ఎప్పటికైనా అమరావతే ప్రజా రాజధాని అని చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన.. ఆదాయ వనరుల్ని సమకూర్చే రాజధాని అమరావతి అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.