English | Telugu

కోర్టు ఆదేశాల మేర‌కు ఒవైసీపై కేసు పెట్టిన పోలీసులు

ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై ఓల్డ్‌ సిటీలోని మొగల్‌పుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అసదుద్దీన్ ఒవైసీతో పాటు.. ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌పై కూడా కేసు ఫైల్ చేశారు. బహిరంగ సభల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఒవైసీపై చర్యలు తీసుకోవాలని దిల్లీకి చెందిన బీజేపీ నేత కపిల్ మిశ్రా నాంపల్లి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును నమోదు చేసినట్లుగా హైదరాబాద్ మొగల్‌పుర పోలీసులు వెల్లడించారు. కర్ణాటకలోకి ఓ సభలో అసద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఇవి ఓ వర్గం వారిని రెచ్చగొట్టేవిగా ఉన్నందునే ఈ కేసును నమోదు చేసినట్లుగా వెల్లడించారు.

ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సభల్లో అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్, భారత్, పాకిస్థాన్ తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీసీ సెక్షన్ 153, 153 (a) 117 295-a, 120b కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు అసదుద్దీన్ ఒవైసీ. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తోన్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఆయన ప్రసంగాలు చేస్తున్నారు.