English | Telugu

నాటు పద్దతిని ఉపయోగిస్తే తప్ప బోటుని బయటకి తీయలేం : బోటు డ్రైవర్లు

గోదావరిలో మునిగిన బోటు బయటకి తీసేదెలా అని అందరూ ఆందోళన చెందుతున్నారు. కచ్చులూరు ఒడ్డున కూర్చొని బోటు చుట్టూ అంచనాలు వేస్తున్న అధికారులు మాత్రం సాంకేతిక పరిజ్ఞానం ఒక్కటే మార్గమంటున్నారు కానీ, స్థానికులు మాత్రం నాటు పద్ధతులు పాటిస్తే తప్ప బోటును బయటకు తీయలేమని చెబుతున్నారు. అయితే, సంఘటనా స్థలంలో ఉన్న పరిస్థితులు మాత్రం ఏ పద్ధతిని పాటించినా బోటుని వెలికితీయటం చాలా కష్టమని సంకేతాలిస్తున్నాయి. గోదావరి నదిలో బోటు మునిగిన ప్రదేశం మామూలు ప్రాంతం కాదు. వేగంగా పరుగెత్తుకొచ్చిన గోదావరి కొండను ఢీ కొనే ప్రదేశం, అంటే కొండను తాకిన నీరు వెనక్కి తిరుగుతోంది.

ఈ క్రమంలో నదిలో భారీ సుడిగుండాలు ఏర్పడతాయి. ఈ సుడిగుండాల్లోనే మునిగింది రాయల్ వశిష్ట బోటు. దాదాపు రెండు వందల ఎనభై అడుగుల లోతులోకి వెళ్లి పడిపోయింది. అయితే గల్లంతైన వారు ఒకవేళ మరణిస్తే వారి మృతదేహాలు బోటులోనే ఉండుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అందరూ చెప్పుకుంటున్న లెక్క ప్రకారం బోటులో ప్రయాణించింది డెబ్బై ఏడు మంది అని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన రోజు ప్రాణాలతో బయటపడ్డ వారు ఖచ్చితంగా ఇరవై ఆరు మంది, చనిపోయిన డెడ్ బాడీలు దొరికిన వారి సంఖ్య ముప్పై ఏడు. ఈ లెక్కన ఇంకా జాడ తెలియాల్సిన వారి సంఖ్య పద్నాలుగు. ఈ పద్నాలుగు మంది ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వారు, వారి బంధువులు ఎవరు అన్నది ఇంకా ఆందోళనకరంగానే ఉంది.

దీంతో మిస్సయిన వారి కోసం ఒడ్డున కూర్చొని వారి బంధువులు బోరుమంటున్నారు. ప్రాణాలతో బయట పడ్డవారి బంధువులు కూడా కొందరు గల్లంతైన వారిలో ఉన్నారు. వాళ్లు బోలెడు ఆశలతో గోదావరి వైపు కన్నీళ్లతో ఆశగా చూస్తున్నారు. గల్లంతయిన వారు బోటులోనే చిక్కుకుపోయి ఉంటే వారిని వెలికి తీసేందుకు సాంకేతిక పరిజ్ఞానం పనికి రాదని చెబుతున్నారు స్థానికులు. బోటులో ఉన్న డెడ్ బాడీ పూర్తిగా కుళ్లిపోయి ఉంటాయని నాటు పద్ధతులను పాటిస్తే బోటులో ఉన్న డెడ్ బాడీలు వెలికి తీసే ఛాన్సుందని చెప్పుకొస్తున్నారు. అయితే, అధికారులు మాత్రం సాంప్రదాయ పద్ధతులపై పెద్దగా ఆసక్తి చూపించటం లేదు. సాంప్రదాయ పద్ధతులను అనుసరించి బోటును వెలికి తీసే ప్రయత్నం చేసే మరో ప్రమాదం జరిగే అవకాశముందని చెబుతున్నారు.

బోటుని వెలికి తీయడం కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో బోటులో ఏవైనా డెడ్ బాడీలు చిక్కితే వాటిని బయటకు తీయడమే ఇప్పుడు అవసరమైన చర్య అంటున్నారు స్థానికులు. బోటు మునిగి ఈ రోజుకి పది రోజులు కావడంతో డెడ్ బాడీలు కుళ్లిపోయి ఉంటాయని అంచనాలు వేస్తున్నారు. మునిగిన రెండో రోజే బోటు పైన బండరాళ్లు వేయడం కానీ నీటి బాంబులతో ప్రకంపణలు సృష్టించడం కానీ చేయాల్సి ఉండేదని చెబుతున్నారు. ఫలితంగా బోటు అద్దాలు పగిలి సుడులు తిరుగుతున్న నీటిలో డెడ్ బాడీలు బయటకు వచ్చేవని చెబుతున్నారు స్థానిక బోటు డ్రైవర్లు.