English | Telugu
రూ 10 వేలు పడేస్తే నెలకు సరిపడా సిగరెట్లు.. ఆ జైలు గదులు చాలా కాస్ట్లీ గురూ...
Updated : Sep 24, 2019
డబ్బు పడేస్తే కొండ మీది కోతైనా దిగి వస్తుందంటారు మన పెద్దలు. అది నిజమో కాదో తెలియదు కానీ ప్రస్తుతం ఆ జైలులో మాత్రం పైసలు ఉండాలే కానీ దొరకని ఫెసిలిటీ లేదని చెపుతున్నారు అక్కడి ఎసిబి అధికారులు. రాజస్థాన్ లోని అజ్మీర్ సెంట్రల్ జైలు లో కొందరు శ్రీమంతులైన ఖైదీలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లుగా అక్కడి ఎసిబి తేల్చింది. దాని కోసం వారు నెలకు కొన్ని లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఎసిబి అధికారుల విచారణలో తేలింది. అజ్మీర్ సెంట్రల్ జైలులోని బ్యారెక్ 1 నుండి 15 వరకు వీఐపీల సెల్ లు ఉన్నాయి. బాగా డబ్బున్న ఖైదీలకు మాత్రమే ఈ బ్యారెక్ లలోని గదులు చిక్కుతాయట. ఈ వీఐపీ సెల్స్ లో సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని ఆ దర్యాప్తు లో తేలింది. ఆ వీఐపీ సెల్స్ లో ఉండే వారికి స్పెషల్ ఫుడ్, కాస్ట్లీ డ్రస్సులు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయట. ఈ ప్రత్యేక సదుపాయాల కోసం నెల ఖర్చు కేవలం 8 లక్షల రుపాయాలే వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నెలకు సరిపడా సిగరెట్ ప్యాకెట్లు సప్లై చేయడానికి రూ. 10 వేల నుండి రూ. 15 వేల వరకు అలాగే పొగాకు ఉత్పత్తులు సరఫరా చేయడానికి ప్యాకెట్ కు రూ. 300 నుంచి రూ. 500 వసూలు చేస్తున్నారని ఈ దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ సొమ్మునంతటిని జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారి కుటుంబ సభ్యులు, బంధువుల నుండి కొంత మంది జైలు సిబ్బంది కలెక్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఐతే కొంత మనది ఈ సొమ్మును నగదు రూపంలో ఇస్తుండగా మరి కొంత మంది ఆన్ లైన్ లో అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ స్కామ్ పై దర్యాప్తు చేసిన అధికారులు దీనికి సంబంధించి 15 బ్యాంకు అకౌంట్లను గుర్తించి 12 మందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నట్లు సమాచారం.