English | Telugu

బిల్లా రంగాలు ఆటోల్లో తిరుగుతున్నారు జాగ్రత్త : సీఎం రేవంత్‌

జూబ్లీహిల్స్‌లో బిల్లారంగాలు ఆటోల్లో తిరుగుతున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి (కేటీఆర్, హరీష్ రావును ఉద్దేశించి) అన్నారు. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో కార్నర్‌ మీటింగ్‌‌లో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. దివంగత నేత పేదల మనిషి పి.జనార్ధనరెడ్డి అకాల మరణంతో 2008 ఉప ఎన్నిక ఆయన ఫ్యామిలీని ఏకగ్రీవంగా ఇవ్వాలని నిర్ణయం జరిగింది. పీజేఆర్‌ కుటుంబానికి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని ఆనాడు తెలుగు దేశం పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. కానీ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఆ ఉప ఎన్నికలో పోటీ అభ్యర్థిని నిలబెట్టారు.

ఒక దుష్ట సంప్రదాయానికి కేసీఆర్ ఆనాడు తెరలేపారని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. ఆస్తిలో వాటా అడుగుతుందని సొంత చెల్లి కవితనే ఇంటి నుంచి పార్టీ నుంచి తరిమివేసినోడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అలాంటోడు జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతను గెలిపించాలని తిరుగుతున్నాడు. ఇదంతా చూస్తుంటే.. కన్నతల్లికి అన్నం పెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడట’ అనే సామేత గుర్తొస్తుందని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. బోరబండకు పీజేఆర్ పేరు పెడతామని సీఎం అన్నారు. జూబ్లీహిల్స్‌లో గత పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదన్నారు.

ఇక్కడ ఎంతో మంది పేదలకు పి.జనార్ధనరెడ్డి ఆశ్రయం కల్పించారని గుర్తు చేశారు. పేదలకు పీజేఆర్ ఇళ్లు కట్టించారని ఆయన అన్నారు. బోరబండ చౌరస్తాకు పీజేఆర్ పేరుతో పాటు విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్‌ను అడ్డం పెట్టుకొని కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు అక్రమంగా వేల కోట్లు సంపాదించుకున్నారని కవిత ఆరోపణలు చేస్తున్నది. దమ్ముంటే ముందు ఆ ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. బోరుబండ అభివృద్ధి చెందాలంటే నవీన్ యాదవ్‌ను గెలిపించాలని అని రేవంత్ తెలిపారు.