English | Telugu

కొత్త పార్లమెంట్ జాతికే గర్వ కారణం! ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ 

భారత ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. వర్చువల్ ద్వారా కొత్త పార్లమెంట్ శంకుస్థాపనకు హాజరవుతానని లేఖలో కేసీఆర్ వెల్లడించారు. కొత్త పార్లమెంట్ దేశ ఆత్మగౌరవానికి, జాతికే గర్వకారణమని అభివర్ణించారు కేసీఆర్. ఈ ప్రాజెక్టు దేశ సార్వభౌమత్వాన్ని ఇనుమడింపజేస్తుందని పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ పనులకు శంకుస్థాపన చేయడం గర్వకారణమని మోడీని అభినందించారు కేసీఆర్. ఈ ప్రాజెక్టు ప్రారంభం విషయంలో చాలా కాలంగా జాప్యం జరుగుతోందన్నారు. ప్ర‌స్తుత‌మున్న పార్ల‌మెంటు, కేంద్ర సచివాలయ భ‌వనాలు ప్రభుత్వ పనులకు పూర్తిస్థాయిలో స‌రిపోవ‌డం లేద‌న్నారు కేసీఆర్. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వ‌ర‌గా పూర్తి కావాల‌ని కోరుకుంటున్నానని తెలిపారు తెలంగాణ సీఎం. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

పార్లమెంట్ కోసం కొత్తగా నిర్మించనున్న సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్స్‌ సంస్థ ఈ ప్రాజెక్టుకు కన్సల్టెంటుగా వ్యవహరిస్తోంది. 'సెంట్రల్ విస్టా' ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ. 20,000 కోట్లుగా ఉంటుందని అంచనా. ప్రాజెక్ట్ కోసం గుజరాత్‌కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాన్ అందించింది. ఇందులో భాగంగా త్రిభుజాకారపు పార్లమెంట్ భవనంతో పాటు ఒక కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకు ఉండే మూడు కిలోమీటర్ల రాజ్‌పథ్‌ను పునరుద్ధరిస్తారు.