మన దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రతి రోజు దాదాపుగా లక్ష పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కరొనాను ఎదుర్కొనేందుకు దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్' క్లినికల్ ట్రయల్స్ కీలక దశలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ బయోటెక్ కొన్ని ఆసక్తికర వివరాలు వెల్లడించింది. జంతువులపై చేసిన కోవాగ్జిన్ ప్రయోగ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని, తమ వ్యాక్సిన్ తో జంతువుల్లో నిరోధక శక్తి బాగా పెరిగిందని అంతేకాకుండా ఎలాంటి దుష్ఫలితాలు కలగలేదని తాజాగా తెలిపింది. వ్యాక్సిన్ రెండో డోస్ ఇచ్చిన తర్వాత 14 రోజుల పాటు వాటిని పరీక్షించగా, వాటి ముక్కు, గొంతు, ఊపిరితిత్తులలో కరోనా వైరస్ వృద్ధిని వ్యాక్సిన్ సమర్థంగా అడ్డుకున్నట్టు గుర్తించామని భారత్ బయోటెక్ వివరించింది. పైగా జంతువుల్లో ఇమ్యూనిటీ కూడా అద్భుతంగా పెరిగిందని వెల్లడించింది.
ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. ఈ ట్రయల్స్ ఢిల్లీలోని ఎయిమ్స్ తో పాటు, హైదరాబాద్ లోని నిమ్స్ , విశాఖలోని కెజిహెచ్, రోహతక్ లోని పిజిఐఎంఎస్ లలో జరుగుతున్న సంగతి తెల్సిందే. ఒక పక్క ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో ట్రయల్స్ తాత్కాలికంగా నిలిచిపోగా.. మరోపక్క భారత బయోటెక్ వారి కొవాగ్జిన్ సత్ఫాలితాలు ఇస్తుండడం ఆనందించదగ్గ పరిణామం.