కరోనా మహమ్మారి కారణంగా సామాన్య జనం ఇప్పటికే సంపాదన లేక అల్లాడుతుంటే తాజాగా ఏపీలోని జగన్ సర్కార్ పేద, సామాన్య మధ్యతరగతి వర్గాల నడ్డి విరిచే నిర్ణయం తీసుకుంది. సామాన్యులు, మధ్యతరగతి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు పొద్దున్న లేచిన దగ్గర నుండి ఏది తినాలన్న గ్యాస్ స్టవ్ వెలిగించాల్సిందే. అయితే తాజాగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు స్టవ్ వెలిగించాలంటే ఏడుపు వచ్చే పరిస్థితి ఏర్పడింది. తాజాగా వంట గ్యాస్ పై ఏపీ ప్రభుత్వం వ్యాట్ ను భారీగా పెంచేసింది. ఇప్పటివరకు 14.5 శాతంగా ఉన్నవ్యాట్ పన్నును ఏకంగా 24.5 శాతానికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయిన నేపథ్యంలో వంట గ్యాస్ పై వ్యాట్ ను 10 శాతం పెంచింది. ఇప్పటికే పెట్రోల్ పై 31 శాతంతో పాటు అదనంగా మరో నాలుగు రూపాయల మేర, డీజిల్ పై 22.5 శాతంతో పాటు అదనంగా నాలుగు రూపాయల మేర వసూలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా గ్యాస్ పైన కూడా వ్యాట్ పెంచి మరీ సామాన్యుల నడ్డి విరుస్తూ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం లో పడింది.
ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వం ఆదాయంతో సంబంధం లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం గత సంవత్సర కాలంగా వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఆదాయం పెంచుకోవడం కోసం మళ్ళీ అదే సామాన్యుల నడ్డి విరిచే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.