ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. అమిత్ షాతో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, కీలక అధికారులతో జగన్ భేటీ కానున్నారని సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న వ్యవహారాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారని తెలుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలోని పరిశ్రమలు నష్టపోయిన వైనాన్ని ఆయన వివరించనున్నారని తెలుస్తోంది. అలాగే రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలతో పాటు, మండలి రద్దు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంతో పాటు పలు విషయాలపై చర్చించనున్నారని సమాచారం.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి వివరాలను అధికారులు విడుదల చేశారు. రేపు ఉదయం 10.30 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీ విమానం బయలుదేరనుంది. మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు జనపథ్ - 1కు చేరుకోనున్నారు. మంగళవారం రాత్రి ఢిల్లీలోనే బస చేసి బుధవారం నాడు ఏపీకి జగన్ తిరుగు పయనం కానున్నారు.