English | Telugu
రాజధాని మారడం బాబుకి ఇష్టం లేదు.. ఢిల్లీ స్థాయిలో రాజకీయం చేస్తున్న చంద్రబాబు
Updated : Dec 30, 2019
మూడు రాజధానుల విషయంలో టిడిపి చేసే విమర్శలను తిప్పికొట్టేందుకు బాబు లక్ష్యంగా పదునైన వాగ్బాణాలు సంధిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. చంద్రబాబును నమ్మలేమని.. ఆయన పైకి ఒకటి చెబుతారు తెరవెనుక మరొకటి చేస్తారంటూ వైసిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సమన్యాయం పేరుతో సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలను అడ్డుకునేందుకు ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. న్యాయవ్యవస్థకు చెందిన కొందరి సాయంతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విశాఖ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి.
ఆధారాలు లేకుండా విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారని.. ఢిల్లీ స్థాయిలో టిడిపి నేతలు ఎవరితో మాట్లాడారని ప్రశ్నించారు ప్రతిపక్ష నేతలు. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు బాబు ఎలాంటి కుట్రలకు తెర తీశారనే ప్రశ్నలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ వేడి కొనసాగుతుండగానే ఇదే స్థాయిలోఆరోపణలు గుప్పించారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు కూడా చెప్పాల్సిన వారికే చెబుతారని వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో విజయసాయి , అవంతి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.