English | Telugu

యూకే నుండి భారత్ వచ్చిన వారిలో 18 మందికి పాజిటివ్.. ఈ వైరస్ కొత్తదో... పాతదో..?

బ్రిటన్ లో రూపాంతరం చెందిన కొత్త కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ తో సహా పలు దేశాలు బ్రిటన్ తో విమాన సంబంధాలను కూడా రద్దు చేసాయి. అయితే ఇప్పటికే వచ్చిన, వస్తున్న వారికి దేశంలోని పలు విమానాశ్రయాల్లో చేస్తున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో వైరస్‌ నిర్ధారణ అవుతోంది. నిన్న మంగళవారం నాడు పలుచోట్ల చేసిన టెస్టులలో 16 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరోవైపు ఈ నెల 11, 13 తేదీలలో యూకే నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరికి కూడా పాజిటివ్‌ గా తేలింది. ఈ ఇద్దరితో కలుపుకుని మంగళవారం వరకు మొత్తం 18 మందికి వైరస్‌ సోకినట్లయింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చేసిన టెస్టులో వీరికి పాజిటివ్‌ రావడంతో గచ్చిబౌలిలోని టిమ్స్‌లో ఉంచి చికిత్స అందిస్తునట్లు సమాచారం. అయితే వీరికి సోకింది కొత్త స్ట్రెయినా? లేక పాత రకందేనా? అన్నది తేలాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా బ్రిటన్ నుంచి వచ్చేవారు కొత్త కరోనా వైరస్ బారినపడినట్టయితే, వారిని టిమ్స్‌లో చేర్చి, వారితో కాంట్రాక్ట్ అయిన కుటుంబ సభ్యులకు మాత్రం అమీర్‌పేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రిలో వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, గత నాలుగు వారాల వ్యవధిలో బ్రిటన్ సహా వివిధ దేశాల నుంచి తెలంగాణకు మూడువేల మందికిపైగా వచ్చినట్టు కేంద్రం నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందింది. దీంతో వీరిలో ముందుగా వచ్చిన 1500 మందిని వైద్యుల పరిశీలనలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు మరో 1500 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

మరోపక్క కేంద్రం కొత్త స్ట్రెయిన్‌ విషయంలో ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ప్రధానంగా కొత్త స్ట్రెయిన్‌ ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి వెంటనే కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్‌ వస్తే వారి నమూనాలను అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలని కోరింది. వాటిని జీనోమ్‌ సీక్వెన్సీ ల్యాబ్‌లకు పంపాలని ఆదేశించింది. ఆ నమూనాల్లో వైరస్‌ తీవ్రత ఎలా ఉందో పరీక్షించేందుకు పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపాలని మంగళవారం ఆదేశాలిచ్చింది. కొత్త స్ట్రెయిన్‌ వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్‌ మాత్రమే కాకుండా అంతర్జాతీయ విమాన ప్రయాణికులందరికి ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయనున్నారు .

నిన్న ఎయిరిండియా విమానంలో లండన్‌ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రయాణికుల్లో 8 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో ఏడుగురు ప్రయాణికులు. మరొకరు విమాన సిబ్బంది ఉన్నారు. సోమవారం రాత్రి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చేసిన పరీక్షల్లో ఐదుగురికి కరోనా ఉన్నట్లు తేలింది. ఇదే విమానంలో ఢిల్లీ ద్వారా చెన్నై వెళ్లిన ప్రయాణికుడికి అక్కడ చేసిన పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. మరోవైపు, 222 మంది ప్రయాణికులతో యూకే నుంచి కోల్‌కతాకు వచ్చిన విమానంలో ఇద్దరికి పాజిటివ్‌ అని తేలింది.

కొత్త స్ట్రెయిన్ తో పిల్లలకు ముప్పు ఎక్కువ..

ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం కరోనా ముప్పు పిల్లలకు తక్కువే. దీనికి కారణం వైరస్‌ ప్రవేశించే ఎస్2 రిసెప్టర్లు చిన్నారుల్లో తక్కువగా ఉండటమే. కానీ, కొత్తగా రూపాంతరం చెందిన వైరస్ ఏస్‌2 రిసెప్టర్ల ను ఛేదించి చొచ్చుకెళ్తోంది. దీంతో పిల్లలకు కూడా ఇది చాలా సులభంగా సోకుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.