English | Telugu

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే 10 మంది మృతి 

గుజరాత్‌లోని వడోదర సమీపంలో ఈ తెల్లవారుజామున ఓ కంటెయినర్, ఓ లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో పదిమంది దుర్మరణం పాలయ్యారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. సూరత్ నుంచి పావగఢ్‌కు వెళ్తున్న లారీ అతివేగంతో వడదోర శివారులో వాగోడియా క్రాస్‌రోడ్డు సమీపంలోని వంతెనపై కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారని.. వీరంతా సూరత్‌కు చెందినవారని, పంచమహల్ జిల్లాకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే వడోదర దగ్గర లో పొగ మంచు వాతావరణం ఉండడంతో.. రోడ్డు కనిపించే పరిస్థితి లేదని అదే సమయంలో లారీ అతివేగం కూడా ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెపుతున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాల్సిందిగా అధికారులను అదేశించారు.