English | Telugu

పూజా హెగ్డేకి అన్న‌గా వెంక‌టేశ్!?

బుట్ట‌బొమ్మ పూజా హెగ్డేకి సీనియ‌ర్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేశ్ అన్న‌గా న‌టించ‌బోతున్నారా? అవున‌న్న‌దే లేటెస్ట్ బ‌జ్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. గ‌తంలో `అనారి` (1993), `త‌ఖ్ దీర్ వాలా` (1995) చిత్రాల‌తో హిందీనాట క‌థానాయ‌కుడిగా సంద‌డి చేసిన వెంక‌టేశ్.. 27 ఏళ్ళ సుదీర్ఘ విరామం అనంత‌రం మ‌రో బాలీవుడ్ ప్రాజెక్ట్ లో క‌నిపించ‌బోతున్నారు. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీని ప‌ర్హాద్ సామ్జీ డైరెక్ట్ చేస్తున్నారు. `క‌బీ ఈద్ క‌బీ దీవాళి`, `భాయ్ జాన్` వంటి టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ ఫ్యామిలీ డ్రామాలో స‌ల్మాన్ కి జోడీగా `బుట్ట‌బొమ్మ‌` పూజా హెగ్డే ఎంట‌ర్టైన్ చేయ‌నుంది. ఇటీవ‌లే సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా జ‌గ‌ప‌తి బాబు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారని స‌మాచారం.

కాగా, ఈ చిత్రంలో పూజా హెగ్డేకి అన్న‌గా వెంక‌టేశ్ క‌నిపిస్తార‌ని బ‌జ్. అంతేకాదు.. జూన్ నుంచి వెంకీ షూటింగ్ లో పాల్గొంటార‌ని వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే స‌ల్మాన్ చిత్రంలో వెంక‌టేశ్ పాత్ర‌పై ఫుల్ క్లారిటీ రానున్న‌ది.

ఇదిలా ఉంటే, వెంక‌టేశ్ తాజా చిత్రం `ఎఫ్ 3` ఈ నెల 27న రిలీజ్ కానుంది. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ మ‌రో హీరోగా న‌టించిన ఈ సినిమాలో త‌మ‌న్నా, మెహ్రీన్ నాయిక‌లుగా న‌టించ‌గా.. పూజా హెగ్డే ఓ స్పెష‌ల్ సాంగ్ లో సంద‌డి చేయ‌నుంది.