English | Telugu

పవన్‌కళ్యాణ్‌ని ఆశ్రయించిన హీరోయిన్‌.. బ్రేక్‌ ఇస్తాడా మరి!

హీరోలతో పోలిస్తే హీరోయిన్ల స్పాన్‌ చాలా తక్కువ. దశాబ్దాలపాటు హీరోలు హీరోలుగానే కొనసాగుతూ ఉంటారు. కానీ, హీరోయిన్ల విషయానికి వస్తే.. అలా జరగదు. పది సంవత్సరాలు లేదా ఎక్కువలో ఎక్కువ 20 సంవత్సరాలు. అంతకుమించి హీరోయిన్లుగా కొనసాగే అవకాశాలు చాలా తక్కువ. ఫామ్‌లో వున్నప్పుడు వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే హీరోయిన్లు అవకాశాలు తగ్గిన తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పడం మనం చూశాం. మరికొందరు కొన్ని సంవత్సరాలు గ్యాప్‌ తీసుకొని ఆ తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ని స్టార్ట్‌ చేయడం కూడా చూశాం. ఇది ఒకప్పటి హీరోయిన్ల పరిస్థితి. కానీ, ఇప్పుడు సినిమాలు తగ్గిన తర్వాత వెంటనే గ్యాప్‌ తీసుకోకుండా స్పెషల్‌ సాంగ్స్‌పై దృష్టి పెడుతున్నారు హీరోయిన్లు.

ఒకప్పుడు జయమాలిని, స్మిత, అనురాధ, డిస్కో శాంతి వంటి వాళ్ళను ఐటమ్‌ గాళ్స్‌గా పిలిచేవారు. వారు ఐటమ్‌ సాంగ్స్‌ మాత్రమే చేసేవారు. ఇప్పుడు వారి స్థానాన్ని హీరోయిన్లే భర్తీ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎంతో మంది హీరోయిన్లు ఐటమ్‌ సాంగ్స్‌ చేశారు. కాకపోతే దాన్ని కాస్త మోడ్రనైజ్‌ చేసి స్పెషల్‌ సాంగ్స్‌ అని పిలుస్తున్నారు. హీరోయిన్లుగా కొనసాగుతున్నవారు కూడా రెమ్యునరేషన్‌ బాగా ముట్టజెబితే స్పెషల్‌ సాంగ్స్‌ చేసేందుకు రెడీ అంటున్నారు. ఇప్పుడు అలా ఓ హీరోయిన్‌ స్పెషల్‌ సాంగ్‌ చేసేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.

డిజె టిల్లు చిత్రంలో రాధికగా నటించి కుర్రకారుని విపరీతంగా ఆకర్షించిన నేహాశెట్టి గ్లామర్‌ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరస అవకాశాలు వచ్చాయి. అయితే ఆమె చేసిన సినిమాల ద్వారా క్రేజ్‌ సంపాదించుకోలేకపోయింది. ఒక్క సినిమాతో హీరోయిన్‌గా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న నేహాకి అవకాశాలు బాగా తగ్గాయి. దీంతో అందరు హీరోయిన్లలాగే స్పెషల్‌ సాంగ్‌ చేసేందుకు సిద్ధమైంది. అది కూడా పవన్‌కళ్యాణ్‌ సినిమాలో. సుజిత్‌ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న ఓజీ చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌ చేసేందుకు నేహాను ఫిక్స్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఆఫర్‌ వల్ల తనకు మంచి బ్రేక్‌ వస్తుందని, ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు బాగా వస్తాయని నేహా నమ్ముతోంది. మరి నేహాశెట్టి చేయబోతున్న ఐటమ్‌ సాంగ్‌తో పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ని, ప్రేక్షకుల్ని ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.