English | Telugu

ఎవరి ఊహకీ అందని విధంగా రామ్‌చరణ్‌, సుకుమార్‌ కొత్త సినిమా?

రామ్‌చరణ్‌ కెరీర్‌లో సుకుమార్‌ కాంబినేషన్‌లో చేసిన ‘రంగస్థలం’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అప్పటివరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా, డీగ్లామరైజ్డ్‌ క్యారెక్టర్‌లో ఒదిగిపోయి నటించిన చరణ్‌ ఉత్తమనటుడుగా సైమా అవార్డు సాధించారు. ఈ సినిమాకి మొత్తం 6 సైమా అవార్డులు లభించాయి. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో సుకుమార్‌ చేసిన ‘పుష్ప’ ఓ చరిత్ర సృష్టించింది. వందేళ్ళ తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎవరూ సాధించని జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్‌ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘పుష్ప2’ చిత్రాన్ని రూపొందించే పనిలో బిజీగా ఉన్నాడు సుకుమార్‌. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ‘రంగస్థలం’ తర్వాత రామ్‌చరణ్‌తో మరో విభిన్న చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు సుకుమార్‌. ప్రస్తుతం శంకర్‌ కాంబినేషన్‌లో ‘గేమ్‌ ఛేంజర్‌’ చేస్తున్న చరణ్‌ ఆ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తన 16వ సినిమాను పట్టాలెక్కిస్తాడు. చరణ్‌ 17వ సినిమాను సుకుమార్‌తో చెయ్యబోతున్నట్టు మెగా ఫ్యామిలీ నుంచి సమాచారం అందుతోంది. ‘రంగస్థలం’లోని చిట్టిబాబు పాత్రకు జీవం పోసిన చరణ్‌కి అందరి ప్రశంసలు లభించాయి. ఆ పాత్రను చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. దానికి ఎంతో హోంవర్క్‌ కావాలి. వినికిడి శక్తిలేని యువకుడి పాత్రను ఛాలెంజ్‌గా తీసుకొని చేశాడు చరణ్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న రెండో సినిమాలో కూడా అలాంటి ఛాలెంజింగ్‌ క్యారెక్టర్‌ ఉంటుందని తెలుస్తోంది.

చరణ్‌, సుకుమార్‌ తాము చేస్తున్న సినిమాల తాలూకు వర్క్‌ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ని స్టార్ట్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన స్టోరీ వర్క్‌ పూర్తయిందట. దాన్ని చరణ్‌ వినడం, ఓకే చెప్పడం కూడా జరిగిపోయిందని తెలుస్తోంది. ‘రంగస్థలం’ తరహాలోనే ఉంటూ చరణ్‌ క్యారెక్టరైజేషన్‌లో చాలా చక్కని వేరియేషన్‌ ఉంటుందని తెలుస్తోంది. దీన్నిబట్టి ఇది ‘రంగస్థలం’ చిత్రానికి సీక్వెల్‌ అనే ప్రచారం కొన్నాళ్లు జరిగింది. అయితే దానికి, ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని మెగా కాంపౌండ్‌లోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

బన్నివాస్‌ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. గతంలో గీతా ఆర్ట్స్‌తో కలిసి ‘100% లవ్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన బన్ని వాస్‌ ఇప్పుడు సుకుమార్‌తో మరో భారీ హిట్‌ను అందుకునేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. చరణ్‌ ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’కి సంబంధించిన ఫినిషింగ్‌ వర్క్‌లో ఉన్నారు. అది పూర్తి కాగానే బుచ్చిబాబు సినిమా ప్రారంభమవుతుంది. అది పూర్తి చేసిన తర్వాత సుకుమార్‌ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్తుందని తెలుస్తోంది. ఈ సినిమాను 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని సమాచారం.