English | Telugu

‘కాంతార చాప్టర్‌1’ని ఫాలో అవుతున్న ‘ఫౌజీ’... ఏ విషయంలో?

టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు కమిట్‌ అయిన హీరోల్లో ప్రభాస్‌ నెంబర్‌ వన్‌ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్‌ చేస్తున్న సినిమాలన్నీ పాన్‌ ఇండియా మూవీసే. ఆ సినిమా తర్వాత అతను కమిట్‌ అయిన సినిమాలు కూడా పాన్‌ ఇండియా మూవీస్‌గా నిర్మాణం జరుపుకుంటున్నాయి. ప్రభాస్‌ చేసిన లాస్ట్‌ మూవీ కల్కి విడుదలై ఏడాదిన్నర అవుతోంది. జనవరి 9న మారుతి కాంబినేషన్‌లో చేస్తున్న రాజా సాబ్‌ విడుదల కాబోతోంది. మరోపక్క హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్‌ లైన్‌లో ఉంది. ఇవి కాక కల్కి2, సలార్‌2 చిత్రాలు కూడా పూర్తి చెయ్యాల్సి ఉంది. ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత ప్రభాస్‌ ఈ సీక్వెల్స్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉంది.

మిగతా సినిమాలతో పోలిస్తే ఫౌజీ షూటింగ్‌ వేగంగానే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికి 60 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ చక్కర్లు కొడుతోంది. ఒక విషయంలో కాంతార చాప్టర్‌ 1ని ఈ సినిమా ఫాలో అవబోతోంది అనేది ఆ వార్త. రిషబ్‌శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన కాంతార ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. సాధారణంగా ఇండియన్‌ మూవీస్‌కి సీక్వెల్స్‌ చేస్తుంటారు. కానీ, ఈ సినిమాకి మాత్రం ప్రీక్వెల్‌ని రూపొందించారు. కాంతార చాప్టర్‌ 1గా ఇటీవల విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే బాహుబలి పార్ట్‌ 1 కలెక్షన్లను కాంతార చాప్టర్‌ 1 క్రాస్‌ చేసి వరల్డ్‌వైడ్‌గా దాదాపు 700 కోట్లు కలెక్ట్‌ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి.

ఇప్పుడు ప్రభాస్‌ చేస్తున్న ఫౌజీ చిత్రం సూపర్‌హిట్‌ అయితే దీనికి ప్రీక్వెల్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన కొన్ని సీక్వెల్స్‌ ఆశించిన విజయాలు అందుకోలేదు. అందుకే కాంతార చాప్టర్‌1ని ఫాలో అవుతూ ఫౌజీకి ప్రీక్వెల్‌ చెయ్యాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన ఓజీ చిత్రానికి కూడా ప్రీక్వెల్‌ ఉంటుందని డైరెక్టర్‌ సుజిత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫౌజీ విషయానికి వస్తే.. ఈ కథ చాలా విస్తృతమైందని చెబుతున్నారు. ప్రీక్వెల్‌కి మంచి స్కోప్‌ ఉన్న సబ్జెక్ట్‌ కావడంతో ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్‌లో ఫౌజీ చిత్రాన్ని విడుదల చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఫౌజీ హిట్‌ అయితే దానికి ప్రీక్వెల్‌ వస్తుంది. మరి ప్రభాస్‌కి ఫౌజీ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.