English | Telugu

బండ్ల గణేష్‌ ఇంట్లో దీపావళి పార్టీ.. అల్లు అరవింద్‌కి నో ఎంట్రీ.. కావాలనే చేస్తున్నాడా?

వార్తకు కాదేది అనర్హం.. ప్రచారంలో ఉన్న ఏ వార్తనైనా వైరల్‌ చేయగల సమర్థత మీడియాకు, సోషల్‌ మీడియాకు ఉంది. కొన్ని వార్తలు ఎలాంటి ఆధారం లేకపోయినా వైరల్‌ అయిపోతుంటాయి. అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది దానికి సంబంధించిన వ్యక్తులు క్లారిటీ ఇచ్చే వరకు ఆ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అలాంటి ఓ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది. టాలీవుడ్‌(Tollywood)లో నటుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ మార్క్‌ని క్రియేట్‌ చేసుకున్న బండ్ల గణేశ్‌(Bandla Ganesh)కి సంబంధించిన వార్త అది. దీపావళి(deepavali) సందర్భంగా గణేష్‌ తన ఇంట్లో ఇండస్ట్రీలోని ప్రముఖులందరికీ పార్టీ ఇస్తున్నారని, మెగాస్టార్‌ చిరంజీవి(Megastar Chiranjeevi)తో సహా అందరికీ ఆహ్వానాలు అందాయని, చిరంజీవి కూడా పార్టీకి హాజరయ్యేందుకు ఓకే చెప్పారని అంటున్నారు. అయితే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌(Allu Aravind)కి ఎలాంటి ఆహ్వానం అందలేదు అనేది ఆ వార్తలోని సారాంశం. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది ఎవరికీ తెలీదు. అయినప్పటికీ ఈ వార్త సోషల్‌ మీడియాలో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బండ్ల గణేష్‌, అల్లు అరవింద్‌ మధ్య దూరం పెరగడానికి కారణం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

ఇటీవల ‘లిటిల్‌ హార్ట్స్‌’(Little Hearts) సినిమా ఫంక్షన్‌కి అతిథులుగా హాజరయ్యారు అల్లు అరవింద్‌, బండ్ల గణేష్‌. ఆ సినిమాకి నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu). వేదికపైకి వచ్చిన బండ్ల గణేష్‌ సినిమా మాఫియాతో జాగ్రత్తగా ఉండాలంటూ అల్లు అరవింద్‌ ఎదుటే ఆ సినిమా హీరో మౌళికి సలహా ఇచ్చాడు. అది అక్కడికి వచ్చిన వారెవ్వరికీ నచ్చలేదు. అంతటితో ఆగకుండా.. సినిమా కోసం మొదటి నుంచీ అందరూ కష్టపడతారని, చివరలో వచ్చిన అల్లు అరవింద్‌ ఆ క్రెడిట్‌ మొత్తం కొట్టేస్తారని వ్యాఖ్యానించాడు. గణేష్‌ చేసిన వ్యాఖ్యలు కోపం తెప్పించేవి అయినప్పటికీ పైకి నవ్వుతూ కనిపించారు అరవింద్‌. ఆ తర్వాత బన్నీ వాసు మాట్లాడుతూ గణేష్‌ మాటలు ఫంక్షన్‌లోని హ్యాపీ మూడ్‌ని పాడు చేశాయన్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ‘మిత్రమండలి’(Mitramandali)సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో బన్నీ వాసు ఆవేశంగా మాట్లాడుతూ.. తనపై కొందరు కుట్ర చేస్తున్నారని, తన వెంట్రుక కూడా పీకలేరని వ్యాఖ్యానించాడు. అది తనని ఉద్దేశించి చేసిన కామెంటేనని అర్థం చేసుకున్న బండ్ల గణేష్‌.. అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు. మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు అని ట్వీట్‌ చేశాడు. ఈ పరిణామాల వల్ల అల్లు ఫ్యామిలీ నుంచి బండ్ల గణేష్‌ దూరం అవుతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అతని ఇంట్లో జరిగే దీపావళి పార్టీకి అల్లు అరవింద్‌ని ఆహ్వానించలేదని చెప్పుకుంటున్నారు. ప్రచారంలో ఉన్న ఈ వార్త ఎంతవరకు నిజం? అందరూ అనుకుంటున్నట్టు అరవింద్‌ ఫ్యామిలీకి గణేష్‌ నిజంగానే దూరమవుతున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.