English | Telugu

'స‌లార్‌'లో క‌వ‌ల సోద‌రులుగా ప్ర‌భాస్ డ్యూయ‌ల్ రోల్‌?!

ప్రభాస్‌కు డ‌బుల్ రోల్ చేయ‌డం కొత్త కాదు. ఎస్ఎస్ రాజమౌళి 'బాహుబలి'లో తండ్రీ కొడుకులుగా నటించాడు. కానీ రెండు క్యారెక్ట‌ర్లు కలిసి క‌నిపించేట్లు స్క్రీన్ స్పేస్‌ పంచుకోలేదు. ఇప్పుడ‌ది మారబోతోంది. 'కేజీఎఫ్' డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ 'స‌లార్'లో, ప్రభాస్ రెండు పాత్రలలో నటిస్తున్నాడు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా కోసం అత‌ను పూర్తిగా భిన్నమైన లుక్స్‌తో, శరీరాకృతితో కనిపించనున్నాడు.

ఈ విష‌యం ఇంకా క‌న్ఫామ్ కాన‌ప్ప‌టికీ, 'సలార్‌'లోని ద్విపాత్రాభినయంలో ప్రభాస్ శారీరకంగా, మానసికంగా ప‌ర‌స్ప‌రం విరుద్ధంగా ఉండే బ్ర‌ద‌ర్స్‌గా కనిపిస్తాడ‌ని స‌మాచారం. ప్రభాస్ ద్విపాత్రాభినయంలో ఒక పాత్ర‌ కోసం ఇప్పటికే షూట్ చేయగా, మరో పాత్రను పోషించడానికి ఇప్పుడు 20 కిలోల బరువు తగ్గాడు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల‌ ప్రకారం 'సలార్‌'లో ప్రభాస్ పోషిస్తున్న‌ రెండు క్యారెక్ట‌ర్లు ఒక‌దానితో ఒక‌టి ఢీకొంటాయి. అవి రెగ్యుల‌ర్‌గా మ‌నం చూస్తూ వ‌స్తోన్న ఒకే పోలిక‌ల‌తో ఉండే ఇద్ద‌రు క‌వ‌ల‌ల లాంటి క్యారెక్ట‌ర్స్ కాద‌ని, భిన్నంగా ఉంటాయ‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ మునుప‌టి రెండు సినిమాలు 'సాహో', 'రాధే శ్యామ్' ఆశించిన రీతిలో ఆడ‌క‌పోయినా 'స‌లార్‌'పై అంచ‌నాలు అసాధార‌ణ స్థాయిలో ఉన్నాయి. 'కేజీఎఫ్' ఫ్రాంచైజీతో ప్ర‌శాంత్ నీల్ దేశంలోని అగ్ర ద‌ర్శ‌కుల జాబితాలో చేర‌డం దీనికో కార‌ణం.