English | Telugu

విజయ్ చేతికి రామ్ చరణ్ ప్రాజెక్ట్!

'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని ఆ వెంటనే 'ఆచార్య'తో నిరాశపరిచిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 15వ సినిమాని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తన 16వ సినిమాని 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రకటించాడు. అయితే తనకొచ్చిన పాన్ ఇండియా ఇమేజ్, 'ఆచార్య' రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని.. రిస్క్ చేయడం ఎందుకున్న ఉద్దేశంతో గౌతమ్ ప్రాజెక్ట్ ని చరణ్ పక్కన పెట్టాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతికి వెళ్లిందని న్యూస్ వినిపిస్తోంది.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'లైగర్'తో విజయ్ సంచలనాలు సృష్టిస్తాడు అనుకుంటే భారీ డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. దీంతో పూరి దర్శకత్వంలో తాను చేయాల్సిన 'జన గణ మన' అటకెక్కింది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా చేస్తున్నాడు. ఇది కూడా చాలా వరకు షూటింగ్ పూర్తయింది. ఈ క్రమంలో తాజాగా మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గౌతమ్ తాజాగా కలిసి కథ వినిపించగా విజయ్ కి నచ్చిందని అంటున్నారు. చరణ్ చేయాల్సిన కథనే విజయ్ కి గౌతమ్ వినిపించాడని, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. మరి విజయ్-గౌతమ్ ల ప్రాజెక్ట్ నిజమైతే.. చరణ్ తన 16వ చిత్రాన్ని ఎవరితో చేయనున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.