Read more!

English | Telugu

బోయపాటి సినిమాలో విలన్ గా గోపీచంద్!

కెరీర్ స్టార్టింగ్ లో 'జయం', 'నిజం', 'వర్షం' సినిమాలలో విలన్ గా నటించి మెప్పించిన గోపీచంద్.. ఆ తర్వాత మాస్  హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా హీరోగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మ్యాచో స్టార్.. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ విలన్ గా అలరించడానికి సిద్ధమవుతున్నాడని ప్రచారం జరుగుతోంది.

రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం గోపీచంద్ ని తీసుకోబోతున్నారని న్యూస్ వినిపిస్తోంది. బోయపాటి సినిమాలలో విలన్ పాత్రలు చాలా బలంగా ఉంటాయి. పైగా హీరోలను తీసుకొచ్చి తన సినిమాల కోసం పవర్ ఫుల్ విలన్స్ గా మారుస్తుంటాడు. 'లెజెండ్'లో జగపతి బాబు, 'సరైనోడు'లో ఆది పినిశెట్టి విలన్స్ ఎంతగా ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'అఖండ'లో శ్రీకాంత్ కూడా నెగటివ్ పాత్రలో మెప్పించాడు. ఇప్పుడు గోపీచంద్ ని కూడా బోయపాటి మళ్ళీ పవర్ ఫుల్ విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల గోపీచంద్ కథ, పాత్ర నచ్చితే విలన్ గా నటించడానికి సిద్ధమే అని ప్రకటించాడు. ఒకవేళ రామ్-బోయపాటి సినిమాలో నిజంగానే గోపీచంద్ విలన్ గా నటిస్తే.. తన స్క్రీన్ ప్రజెన్స్, యాక్షన్ తో మాస్ కి పూనకాలు తెప్పిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి గోపీచంద్ టాలెంట్ ఎక్కువమందికి రీచ్ అయ్యే అవకాశముంది.