English | Telugu

మ‌హేశ్ కి విల‌న్ గా విజ‌య్ సేతుప‌తి!?

ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే ద‌క్షిణాది న‌టుల్లో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి ఒక‌రు. ఒక‌వైపు క‌థానాయకుడిగా క‌నిపిస్తూనే.. మ‌రోవైపు ప్ర‌తినాయ‌కుడిగానూ, స‌హాయ న‌టుడిగానూ మెస్మ‌రైజ్ చేస్తున్నారీ టాలెంటెడ్ యాక్ట‌ర్. అంతేకాదు.. కేవ‌లం త‌మిళంకే ప‌రిమితం కాకుండా ఇత‌ర భాష‌ల్లోనూ త‌న‌దైన ముద్రవేస్తూ ముందుకు సాగుతున్నారు విజ‌య్. ఈ క్ర‌మంలోనే.. `సైరా.. న‌ర‌సింహారెడ్డి` (2019), `ఉప్పెన‌` (2021) వంటి తెలుగు చిత్రాల్లో సంద‌డి చేశారు విజ‌య్ సేతుప‌తి.

ఇదిలా ఉంటే, త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ ప్రాజెక్ట్ లో బ్యాడీగా ఎంట‌ర్టైన్ చేయ‌నున్నార‌ట మ‌క్క‌ల్ సెల్వ‌న్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. రీసెంట్ గా `స‌ర్కారు వారి పాట‌`తో వినోదాలు పంచిన‌ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు.. త్వ‌ర‌లో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మ‌హేశ్ కి జంట‌గా `బుట్టబొమ్మ‌` పూజా హెగ్డే ఆడిపాడ‌నుంది. కాగా, ఇదే చిత్రంలో మ‌హేశ్ ని ఢీ కొట్టే పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి క‌నిపిస్తార‌ట‌. అంతేకాదు.. క‌థానాయ‌కుడి పాత్ర‌కి దీటుగా ఈ వేషం ఉంటుంద‌ట‌. త్వ‌ర‌లోనే మ‌హేశ్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ మూవీలో విజ‌య్ సేతుప‌తి ఎంట్రీపై క్లారిటీ రానుంది.