English | Telugu
రవితేజ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ లో చిట్టి!
Updated : Jun 5, 2022
బ్లాక్ బస్టర్ మూవీ `జాతిరత్నాలు` (2021)తో కథానాయికగా తొలి అడుగేసింది ఫరియా అబ్దుల్లా. అందులోని చిట్టి పాత్రతో కుర్రకారుని ఫిదా చేసేసింది. ఆపై అఖిల్ అక్కినేని `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` (2021) కోసం అతిథి పాత్రలోనూ, కింగ్ నాగార్జున - యువ సామ్రాట్ నాగచైతన్య `బంగార్రాజు` (2022) కోసం ప్రత్యేక గీతంలోనూ దర్శనమిచ్చింది. ఓవరాల్ గా.. కెరీర్ లో హ్యాట్రిక్ హిట్స్ చూసింది.
ఇదిలా ఉంటే, మాస్ మహారాజా రవితేజ తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో సందడి చేసే ఛాన్స్ దక్కించుకుందట ఫరియా. ఆ వివరాల్లోకి వెళితే.. `నేను లోకల్` ఫేమ్ త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా `ధమాకా` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో `పెళ్ళి సంద-డి` ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. రవితేజకి చెల్లెలి పాత్రలో ఫరియా కనిపించనుందని బజ్. అలాగే, `ధమాకా` తరువాత రవితేజ నుంచి రానున్న `రావణాసుర`లోనూ ఫరియా నటిస్తోంది. `స్వామి రా రా` ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది.
మరి.. రవితేజ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ లో నటించే అవకాశం దక్కించుకున్న ఫరియా అబ్దుల్లా ఆయా చిత్రాలతో ఎలాంటి గుర్తింపుని, ఫలితాలను పొందుతుందో చూడాలి. కాగా, త్వరలోనే `ధమాకా`లో ఫరియా ఎంట్రీపై క్లారిటీ రానున్నది.