English | Telugu

బాలయ్య-బోయపాటి కాంబోలో నాలుగో సినిమా!

టాలీవుడ్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ప్రత్యేక క్రేజ్ ఉంది. ఇప్పటిదాకా వీరి కలయికలో 'సింహా', 'లెజెండ్', 'అఖండ' అనే మూడు సినిమాలు రాగా మూడూ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే త్వరలోనే ఈ ఇద్దరూ నాలుగో ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.

బాలయ్యతో బోయపాటి ఓ పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా పూర్తి కావొస్తోంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు బాలయ్య. మరోవైపు బోయపాటి సైతం ప్రస్తుతం యంగ్ హీరో రామ్ పోతినేనితో ఓ పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాడు. ఆ తర్వాత బాలయ్య ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడని తెలుస్తోంది.

బాలయ్య-బోయపాటి కాంబోలో రానున్న నాలుగో సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పట్టాలెక్కనుందని న్యూస్ వినిపిస్తోంది. అంతేకాదు వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి 2024 వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. మరి ఈ పొలిటికల్ ఫిల్మ్ తో బాలయ్య ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.