Read more!

English | Telugu

తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్త‌మ న‌టుడు అవార్డు ద‌క్కేదెప్పుడు?

 

జాతీయ స్థాయిలో తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు, తెలుగు సినీ క‌ళాకారుల‌కు స‌రైన గుర్తింపు, గౌర‌వం ల‌భించ‌డం లేద‌ని చాలామంది సినిమావాళ్లు వాపోతుంటారు. ఎట్ట‌కేల‌కు క‌మ‌ర్షియ‌ల్‌గా 'బాహుబ‌లి', 'బాహుబ‌లి 2' సినిమాలు సాధించిన అసాధార‌ణ విజ‌యంతో తెలుగు ప‌రిశ్ర‌మ‌కు త‌గిన గుర్తింపు ల‌భించింద‌ని సంతోష‌ప‌డుతున్నాం మ‌నం. క‌ళ‌కు, క‌ళాకారుల‌కు గుర్తింపు ల‌భించాల‌ని కోరుకోవ‌డం స‌మంజ‌సం, స‌మ‌ర్థ‌నీయం! అలాంటి గుర్తింపు పొంద‌గ‌లిగిన క‌ళాకారులు ఎంతో సంతృప్తి చెందుతారు. అయితే ఇక్క‌డ ఒక అనుమానం. కంటెంట్ ప‌రంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొంద‌గ‌ల స్థాయిలో మ‌న సినిమాలు ఉంటున్నాయా? అని ప్ర‌శ్నించుకుంటే మ‌న‌కు అంత సంతృప్తిక‌ర‌మైన జ‌వాబు ల‌భించ‌దు.

సినిమాల సంఖ్య‌లో మ‌నం బాలీవుడ్‌తో పోటీ పడుతున్నాం. కొన్ని క్యాలండ‌ర్ సంవ‌త్స‌రాల్లో హిందీ సినిమాల కంటే తెలుగు సినిమాలే ఎక్కువ‌గా నిర్మాణ‌మైన సంద‌ర్భాలున్నాయి.  కానీ కంటెంట్‌ క్వాలిటీ విష‌యంలో మాత్రం అంద‌రికంటే చాలా వెనుక‌బ‌డి ఉన్నామ‌న్న విష‌యం బాధ క‌లిగిస్తున్నా ఒప్పుకోవాల్సిందే. సామాజిక స్పృహ‌, సాంఘిక ప్ర‌యోజ‌నం లాంటి అంశాల కోసం మ‌న సినిమాల్లో కాగ‌డాపెట్టి వెత‌కాలి. అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే అలాంటి సినిమాలు వ‌స్తుంటాయి.  క‌ళాత్మ‌క విలువ‌ల‌కు మ‌న సినిమాలు బ‌హుదూరంగా ఉంటాయి. కేవ‌లం వ్యాపార‌దృష్టి, లాభాపేక్ష త‌ప్ప స‌మాజంపై నైతిక బాధ్య‌త‌ను మ‌న సినిమాలు ప్ర‌ద‌ర్శించ‌వు. 

అరువు తెచ్చుకున్న క‌థ‌ల‌తో, మ‌న వాతావ‌ర‌ణం ఏమాత్రం క‌నిపించ‌ని స‌న్నివేశాల‌తో, మూడు ఫైట్లు, ఆరు డ్యూయెట్లు (ఒక్కోసారి అటుదిటు) లాంటి మూస ధోర‌ణిలో నిర్మాణ‌మ‌య్యే మ‌న సినిమాల‌కు జాతీయ స్థాయిలో అవార్డులు ల‌భించ‌డం ఎలా సాధ్యం? ఇక ఇంత‌దాకా ఒక్క తెలుగు సినిమా కూడా ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు అవార్డుల‌ను అందించ‌లేక‌పోయిందంటే ఎంత‌టి అవ‌మాన‌క‌రం! మ‌న‌కంటే ఎంతో చిన్న‌వైన మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌రాఠీ, బెంగాలీ, ఒడిశా సినీ ప‌రిశ్ర‌మ‌లు ఎంతో విలువైన‌, అభ్యుద‌యం మూర్తీభ‌వించిన సినిమాలు నిర్మిస్తూ జాతీయంగానే కాకుండా అంత‌ర్జాతీయంగానూ అవార్డులు సాధిస్తున్నారు. స‌మాంజంపై అవ‌గాహ‌న‌ను ప్ర‌ద‌ర్శిస్తూ, స‌మ‌కాలీన స‌మ‌స్య‌ల‌ను ప్ర‌తిబింబించే ప్ర‌యోజ‌నాత్మ‌క చిత్రాల‌కు ఎప్పుడూ గుర్తింపు ల‌భిస్తూనే ఉంటుంది.

నిమ‌జ్జ‌నం, శంక‌రాభ‌ర‌ణం, మేఘ‌సందేశం, రుద్ర‌వీణ‌, క‌ర్త‌వ్యం, గీతాంజ‌లి, దాసి, శ‌త‌మానం భ‌వ‌తి, మ‌హాన‌టి, మ‌హ‌ర్షి లాంటి చిత్రాల‌కు జాతీయ పుర‌స్కారాలు ల‌భించిన సంద‌ర్భాలున్నాయి. ప‌రిశీలిస్తే ఉత్త‌మాభిరుచులు క‌లిగిన చిత్రాల‌కు ఎప్పుడూ గుర్తింపు, అవార్డులు ల‌భిస్తాయ‌నే విష‌యాన్ని మ‌నం విస్మ‌రించ‌కూడ‌దు. సినిమాల సంఖ్య‌లో సాధిస్తున్న ప్ర‌గ‌తిని, క్వాలిటీ విష‌యం వైపు కూడా మ‌ళ్లించ‌గ‌లిగితే మ‌న‌కూ కంటెంట్ ప‌రంగా ఎన‌లేని గుర్తింపు ల‌భిస్తుంది. సినీ ప్ర‌ముఖులంతా ఈ విష‌యంపై ఆలోచించాలి.