Read more!

English | Telugu

తెర‌పై త‌న పేరు బాలు ఎప్పుడు చూసుకున్నారో మీకు తెలుసా?

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల స‌రిహ‌ద్దుప‌ల్లె కోనేటంపేట‌లో పుట్టిన శ్రీ‌ప‌తి పండితారాధ్యుల బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం తెలుగువారికీ, త‌మిళుల‌కూ ఉమ్మ‌డి సినీ గాయ‌కుడు. త‌మిళాంధ్ర దేశాల‌ను బాలులాగ ఉర్రూత‌లూగించిన గాయ‌కుడు మ‌రొక‌రు లేరు. ఒక‌విధంగా ఘంట‌సాల తెలుగు రంగానికీ, టి.ఎం. సౌంద‌ర‌రాజ‌న్ త‌మిళ రంగానికీ ప‌రిమిత‌మైన‌వాళ్లు. కాని బాలు గ‌ళం ఈ రెండు రంగాల‌కే కాకుండా క‌న్న‌డ‌, హిందీ రంగాల‌కు కూడా వ్యాపించి తెలుగు గాయ‌క‌శ్రేణికి అఖండ‌మైన కీర్తి ఆర్జించి పెట్టింది.

అయితే బాలు కేవ‌లం గాయ‌కుడు మాత్ర‌మే కాదు. ఆయ‌న‌లో గొప్ప సంగీత ద‌ర్శ‌కుడు కూడా ఉన్నాడు. సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రాలు కొద్దే అయిన‌ప్ప‌టికీ, ఆ చిత్రాల‌లోని ప్ర‌తి పాటా ఒక మ‌ణిపూస. ఆయ‌న స్వ‌ర‌ర‌చ‌న అంతటి మ‌ధుర‌మైన‌ది, అంత‌టి శ‌క్తిమంత‌మైన‌ది. ఆయ‌న 30 తెలుగు చిత్రాల‌కు సంగీతం స‌మ‌కూర్చారు. నేటి త‌రంలో చాలా మందికి తెలీని విష‌యం ఆయ‌న ఇత‌ర భాషా చిత్రాల‌కూ సంగీత బాణీలు అందించార‌నేది. 9 క‌న్న‌డ సినిమాలు, 5 త‌మిళ సినిమాలు ఆయ‌న సంగీత ర‌చ‌న‌కు నోచుకున్నాయి. అంతే కాదు, 'నాచే మ‌యూరి' (1986) హిందీ సినిమాకూ ఆయ‌న బాణీలు కూర్చారు. 'హ‌మ్ పాంచ్' (1980) సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన చ‌రిత్ర బాలుది.

నిజానికి ఆయ‌న సినీ సంగీత ద‌ర్శ‌కుడు కావ‌డానికి ముందే స్వ‌ర‌కర్త అయ్యారు. ఆల్ ఇండియా రేడియో పోటీల కోసం తొలిసారిగా ఆయ‌న స్వ‌రాలు కూర్చారు. 1961-62 ప్రాంతంలో త‌న తండ్రిగారు రాసిన రెండు పాట‌ల‌కు బాలు స్వ‌యంగా స్వ‌రాలు కూర్చారు. వాటిలో 'పాడ‌వే ప‌ల్ల‌కీ..' అనేది ఒక పాట అయితే, 'ప‌చ్చ‌ని వెచ్చ‌ని ప‌చ్చిక సుడిలో..' అనేది మ‌రో పాట‌. విశేష‌మేమంటే అస‌లు సంగీత‌మే నేర్చుకోని ఆయ‌న ల‌లిత సంగీత ఛాయ‌ల‌తో వాటికి సంగీతం స‌మ‌కూర్చ‌డం.

ఆ త‌ర్వాత‌, 1963లో మ‌ద్రాసులోని క‌ల్చ‌ర‌ల్ క్ల‌బ్‌లో జ‌రిగిన పాట‌ల పోటీల కోసం 'రాగ‌మో అనురాగ‌మో..' పాట త‌నే రాసుకొని, స్వ‌రాలు అల్లారు బాలు. ఆ పాట‌తోనే త‌న గురువు ఎస్పీ కోదండ‌పాణి దృష్టిలో ప‌డ్డారు. సంగీత ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కు తొలి అవ‌కాశం ఇచ్చింది న‌టుడు పేకేటి శివ‌రామ్‌. అయితే అది సినిమా కోసం కాదు, 'తెలుగు త‌ల్లి' అనే డాక్యుమెంట‌రీకి. దానికి నేప‌థ్య సంగీతం అందించారు బాలు. అందులో ఓ పాటకి కూడా సంగీతం స‌మ‌కూర్చారు. అలా మొద‌టిసారి తెర‌మీద సంగీత ద‌ర్శ‌కునిగా త‌న పేరు చూసుకున్నారు బాలు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న సినీ సంగీత ద‌ర్శ‌కుడ్ని చేసింది దాస‌రి నారాయ‌ణ‌రావు. 1977లో ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'క‌న్యాకుమారి' సినిమాతో గాయ‌కుడు బాలు సినీ సంగీత ద‌ర్శ‌కుడిగా కూడా మారారు.