Read more!

English | Telugu

అమ్మ అంత్య‌క్రియ‌ల‌ను శ్రీ‌దేవి నిర్వ‌హించార‌ని మీకు తెలుసా?

 

అతిలోక‌సుంద‌రి శ్రీ‌దేవి కోట్లాదిమంది ఆరాధ‌కుల్ని, అభిమానుల్ని దుఃఖ సాగ‌రంలో ముంచేసి 2018 ఫిబ్ర‌వ‌రి 24న దుబాయ్‌లో అనూహ్య‌మైన ప‌రిస్థితుల్లో తిరిగిరాని లోకాల‌కు త‌ర‌లిపోయారు. నాలుగేళ్ల ప‌సివ‌య‌సులో బాల‌న‌టిగా కెరీర్‌ను ఆరంభించి స్టార్ కిడ్‌గా పేరు తెచ్చుకొని, ఆ త‌ర్వాత ద‌క్షిణాది, ఉత్త‌రాది తేడా లేకుండా తారాప‌థానికి దూసుకుపోయి, తిరుగులేని నంబ‌ర్‌వ‌న్ హీరోయిన్‌గా రాణించారు శ్రీ‌దేవి. ఆమెకు త‌ల్లితండ్రుల‌తో అటాచ్‌మెంట్ చాలా ఎక్కువ‌. ఒక‌వైపు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూతుర్ని పెంచుతూనే, ఆమెను అమితంగా ప్రేమించేవారు త‌ల్లితండ్రులు రాజేశ్వ‌రి, అయ్య‌ప్ప‌న్‌.

షూటింగ్‌కు వెళ్తున్న‌ప్పుడు రోజుకోసారైనా ఫోన్లో మాట్లాడ‌క‌పోతే వారితో ఫోన్‌లో మాట్లాడ‌క‌పోతే శ్రీ‌దేవికి ఏం తోచేది కాదు. వాళ్ల‌ను విడిచి షూటింగ్‌ల కోసం దూర‌ప్రాంతాల‌కు వెళ్లాల‌న్నా ఆమెకు క‌ష్టంగా ఉండేది. అయితే, ఓసారి కొన్ని నెల‌ల‌పాటు వ‌రుస షూటింగ్‌ల‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. హిందీ సినిమాలు 'గురుదేవ్‌', 'రూప్‌కీ రాణీ చోరోంకా రాజా', 'ల‌మ్హే'.. ఈ మూడు సినిమాలూ ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి వ‌రుస‌గా షూటింగ్‌లు జ‌రిగాయి. ఆ టైమ్‌లో రోజూ ఉద‌యాన్నే ఇంటి నుంచి ఆమెకు ఫోన్ వ‌చ్చేది. అమ్మానాన్న‌ల‌తో కాసేపు మాట్లాడేసి స్పాట్‌కు వెళ్లేవారు శ్రీ‌దేవి.

కానీ, ఓరోజు.. ఎందుక‌నో తండ్రి నుంచి ఫోన్ రాలేదు. చాలాసేపు ఎదురుచూసి, ఎప్ప‌టికీ ఫోన్ రాక‌పోవ‌డంతో దిగాలుగా షూటింగ్‌కు వెళ్లిపోయారు. ఆ మ‌ర్నాడు ఉద‌యాన్నే అమ్మ ఫోన్ చేశారు. "నాన్న‌కు ఒంట్లో బాలేదు, అందుకే నిన్న నీకు ఫోన్ చేయ‌లేదు" అని చెప్పారు. అస‌లు విష‌యం ఏంటంటే.. వాళ్ల‌నాన్న ఆ ముందురోజే మృతిచెందారు! అది తెలిస్తే కూతురు త‌ట్టుకోలేద‌నీ, వెంట‌నే ఇంటికి బ‌య‌లురేది రావ‌డం క‌ష్ట‌మ‌నీ చెప్ప‌లేదు. ఆ బాధ నుంచి కోలుకోవ‌డానికి ఆమెకు చాలా కాలం ప‌ట్టింది. 

ఆ త‌ర్వాత రాజేశ్వ‌రిగారికి అనారోగ్యం. అప్ప‌ట్లో శ్రీ‌దేవి 'జుదాయి' షూటింగ్‌లో ఉన్నారు. అమ్మ చ‌నిపోయింద‌ని ఫోన్ వ‌చ్చింది. వెంట‌నే ఇంటికి వ‌చ్చేశారు. అమ్మ ఆమెతో ఎప్పుడూ అంటుండేవారు, "నువ్వు నా కూతురివి కాదు.. కొడుకువి" అని. అందుకే అమ్మ అంత్య‌క్రియ‌లు శ్రీ‌దేవే నిర్వ‌హించారు. అది ఆమె జీవితంలో అత్యంత విషాద‌క‌ర ఘ‌ట‌న‌. అమ్మానాన్న‌లు చ‌నిపోయిన‌ప్పుడు ఆమె క‌ళ్ల‌వెంట నీళ్లు రాలేదు. అలాగ‌ని ధైర్యంగానూ లేరు. ఏదో నిర్వికార భావ‌న ఆమెను చాలా రోజుల‌పాటు ఆవ‌హించింది.