English | Telugu
72 ఏళ్ల క్రితమే తొలి పాన్ ఇండియా హీరోగా చరిత్ర సృష్టించిన నటరత్న ఎన్.టి.ఆర్.!
Updated : Jan 17, 2026
(జనవరి 18 నటరత్న ఎన్.టి.రామారావు వర్థంతి సందర్భంగా..)
- తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్
- తెలుగులో తొలి ద్విపాత్రాభినయ సినిమా
- భానుమతి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో పాన్ ఇండియా మూవీస్ రాజ్యమేలుతున్నాయి. టాప్ హీరోలందరూ తాము చేసే సినిమాలు పాన్ ఇండియా లెవల్‌లో ఉండాలని కోరుకుంటున్నారు. చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే తమ సినిమా కూడా రిలీజ్ అవ్వాలని ఆశిస్తున్నారు. పలు భాషల్లో రిలీజ్ అయిన ప్రతి సినిమాను పాన్ ఇండియా మూవీగా పరిగణిస్తారు. ఈ ప్రక్రియ కొత్తదేం కాదు. దాదాపు 72 ఏళ్ళ క్రితమే ఎన్టీఆర్ హీరోగా తొలి పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయి చరిత్ర సృష్టించింది. ఆ సినిమాకి సంబంధించిన విశేషాల గురించి తెలుసుకుందాం.
1949లో ‘మనదేశం’ చిత్రంతో ఎన్టీఆర్ నటుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత 1951లో ‘పాతాళభైరవి’ చిత్రంతో మాస్ హీరోగా తనేమిటో ప్రూవ్ చేసుకున్నారు. ఇక భానుమతి విషయానికి వస్తే.. 1939లోనే నటిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు. ఆ విధంగా ఎన్టీఆర్ కంటే భానుమతి చాలా సీనియర్. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘మల్లీశ్వరి’. అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి భర్త రామకృష్ణ దర్శకత్వంలో ‘ప్రేమ’ చిత్రంలో నటించారు భానుమతి. ఆ సినిమా జరుగుతున్న సమయంలోనే ‘చండీరాణి’ కథ గురించి చెప్పారు రామకృష్ణారావు.
అప్పటికే భానుమతి, రామకృష్ణారావుల సొంత నిర్మాణ సంస్థ భరణి పిక్చర్స్ తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు నిర్మిస్తోంది. భర్త చెప్పిన చండీరాణి పాయింట్‌తో సినిమా చేస్తే బాగుంటుందని భావించారు భానుమతి. అయితే ఈ సినిమాను ఆమెనే డైరెక్ట్ చెయ్యమని చెప్పారు రామకృష్ణారావు. మొదట డైరెక్ట్ చేసేందుకు ఆలోచించినా భర్త దర్శకత్వ పర్యవేక్షణ చేస్తానని చెప్పడంతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు భానుమతి. అలా తెలుగు, తమిళ భాషల్లో ‘చండీరాణి’ ప్రారంభమైంది. అయితే రామకృష్ణారావు బయటి సంస్థ నిర్మిస్తున్న ‘బ్రతుకు తెరువు’ చిత్రంతో బిజీగా ఉండడం వల్ల ‘చండీరాణి’ చిత్రం గురించి పట్టించుకోవడం ఆయనకు కుదరలేదు. దాంతో దర్శకత్వ బాధ్యతలను పూర్తిగా భానుమతే తీసుకున్నారు. తెలుగు, తమిళ్‌లో ఎన్టీఆర్‌ను హీరోగా అనుకున్నారు. హిందీలో కూడా చేస్తే ఖర్చు కలిసి వస్తుందని భావించారు భానుమతి.
హిందీ వెర్షన్ కోసం దిలీప్‌కుమార్‌ను అనుకున్నారు. అయితే ఈ సినిమా కోసం మద్రాస్ వచ్చి వెళ్ళడం కష్టంగా భావించిన దిలీప్ కుమార్.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అప్పుడు హిందీ వెర్షన్‌కి కూడా ఎన్టీఆర్‌నే తీసుకున్నారు. అలా మూడు భాషల్లో భరణి పిక్చర్స్ పతాకంపై ‘చండీరాణి’ చిత్రం తెరకెక్కింది. ఇందులో కిశోర్ పాత్రలో ఎన్టీఆర్ నటించగా, చండీగా.. రాణిగా భానుమతి ద్విపాత్రాభినయం చేశారు. 1953 ఆగస్ట్ 28న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ‘చండీరాణి’ ఘనవిజయం సాధించి భరణి సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.
1953లోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా మూవీగా ‘చండీరాణి’ చరిత్ర సృష్టించింది. అలా తొలి పాన్ ఇండియా హీరోగా ఎన్టీఆర్ రికార్డు క్రియేట్ చేశారు. అంతేకాదు, తెలుగులో తొలి ద్విపాత్రాభినయ చిత్రం కూడా ఇదే కావడం విశేషం.