Read more!

English | Telugu

ఫొటో వెనుక క‌థ‌.. ముగ్గురు లెజెండ్స్ క‌లుసుకున్న వేళ‌..!

 

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, వాణిశ్రీ జంట‌గా కె.ఎస్‌. ప్ర‌కాశ‌రావు (కె. రాఘ‌వేంద్ర‌రావు తండ్రి) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ప్రేమ‌న‌గ‌ర్' చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యింది. డి. రామానాయుడు నిర్మించ‌గా 1971 సెప్టెంబ‌ర్ 24న రిలీజైన ఈ సినిమా విడుద‌లైన‌ప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తుఫాను అల్ల‌క‌ల్లోలం సృష్టించింది. దాన్ని త‌ట్టుకొని 13 కేంద్రాల‌లో వంద రోజులు ఆడిన ఈ సినిమా రామానాయుడును మునుప‌టి క‌ష్టాల నుంచి, న‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించింది. ఈ సినిమా విజ‌యోత్స‌వం 1972 జ‌న‌వ‌రి 10న మ‌ద్రాస్‌లో కోలాహ‌లంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు అప్ప‌టి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి క‌రుణానిధి, ద‌క్షిణ భార‌త చ‌ల‌న‌చిత్ర వాణిజ్య‌మండ‌లి అధ్య‌క్షుడు ఎ.ఎల్‌. శ్రీ‌నివాసన్‌, న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్‌, త‌మిళ లెజెండ‌రీ యాక్ట‌ర్‌ శివాజీ గ‌ణేశ‌న్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. Also read: ​విల‌న్‌గా భ‌య‌పెట్టి 50 ఏళ్ల వ‌య‌సులోనే అర్ధంత‌రంగా క‌న్నుమూసిన త్యాగ‌రాజు!

ఈ సంద‌ర్భంగా జాతీయ ర‌క్ష‌ణ నిధికి సురేశ్ మూవీస్ ఇచ్చిన రూ. 10 వేల‌ను క‌రుణానిధి అందుకున్నారు. ఇదే వేడుక‌లో విజ‌యా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత నాగిరెడ్డి ఇదివ‌ర‌కు తాను జాతీయ ర‌క్ష‌ణ‌నిధికి ఇచ్చిన 25 వేల రూపాయ‌ల‌కు అద‌నంగా మ‌రో 10 వేల రూపాయ‌లు అంద‌జేశారు. వాహిని స్టూడియో, ప్ర‌సాద్ ప్రాసెస్ సంస్థ‌లు, వాటి అనుబంధ సంస్థ‌ల సిబ్బంది క‌లిసి మ‌రో 10 వేల రూపాల‌య‌ను ర‌క్ష‌ణ నిధికి అంద‌జేశారు. వీటికి సంబంధించిన చెక్కుల‌ను క‌రుణానిధికి శివాజీ గ‌ణేశ‌న్ అంద‌జేశారు.

త‌న‌కు అంద‌జేసిన షీల్డును జైహింద్ స‌త్యం వేలం వేయ‌గా, దాన్ని హిందీ న‌టుడు ప్రాణ్ రూ. 7 వేల‌కు కొన్నారు. దానికి ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి నుంచి రూ. 8 వేల‌ను క‌రుణానిధి క‌లిపారు. ఈ మొత్తాన్ని ర‌క్ష‌ణ నిధికి స‌మ‌ర్పించారు. Also read: ​మ‌న గుండెల్లో ఎప్ప‌టికీ నిలిచివుండే ఎవ‌ర్‌గ్రీన్ హీరో.. ఏఎన్నార్‌!

డి. రామానాయుడు స్వాగ‌తోప‌న్యాసం చేసిన ఈ కార్య‌క్రమాన్ని న‌వ‌యుగ ఫిలిమ్స్ ప్ర‌తినిధి కాట్ర‌గ‌డ్డ న‌ర‌స‌య్య నిర్వ‌హించారు. క‌రుణానిధి, నంద‌మూరి తార‌క‌రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, శివాజీ గ‌ణేశ‌న్‌, దాశ‌ర‌థి త‌దిత‌రులు మాట్లాడారు.

'ప్రేమ‌న‌గ‌ర్' సినిమా త‌మిళంలో శివాజీ గ‌ణేశ‌న్‌తో 'వ‌సంత మాళిగై' (1972) టైటిల్‌తో, హిందీలో రాజేశ్ ఖ‌న్నాతో 'ప్రేమ్‌న‌గ‌ర్' (1974) టైటిల్‌తో రీమేక్ అయ్యి, ఆ రెండు భాష‌ల్లోనూ ఘ‌న‌విజ‌యం సాధించింది.