Read more!

English | Telugu

25 వేల కోసం 15 కిలోల వెండిని తాక‌ట్టు పెట్టిన డైరెక్ట‌ర్‌!

 

శ్రీ‌ను వైట్ల‌, వి.వి. వినాయ‌క్‌, ర‌వికుమార్ చౌద‌రి లాంటి ద‌ర్శ‌కుల‌కు గురువుగా, స్టువ‌ర్ట్‌పురం దొంగ‌లు, ప‌బ్లిక్ రౌడీ, న‌క్ష‌త్ర పోరాటం, అమ్మ‌దొంగా, యాక్ష‌న్ నెం.1 లాంటి చిత్రాల ద‌ర్శ‌కుడిగా మంచి పేరు సంపాదించుకున్న సాగ‌ర్ కెరీర్ మొద‌ట్లో చాలా ఇక్క‌ట్లు ప‌డ్డార‌నే విష‌యం చాలామందికి తెలీదు. 'రాకాసిలోయ' మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఆయ‌నకు రెండో సినిమా 'డాకు' క‌మ‌ర్షియ‌ల్ హిట్‌నిచ్చింది. అయితే మూడో సినిమా ఆయ‌న‌ను ముప్పుతిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఆ సినిమా.. 'మావారి గోల‌'. ఈ సినిమాకు మొద‌లుపెట్టిన ప్రొడ్యూస‌ర్‌కు హిందీలో గోవిందా డేట్స్ దొర‌క‌డంతో, ఈ ప్రాజెక్టును వ‌దిలేసి, అక్క‌డ‌కు వెళ్లిపోయాడు. 

ఆగిపోయిన సినిమా డైరెక్ట‌ర్ అంటారేమోన‌నే భ‌యంతో, త‌న సోద‌రుల స‌హ‌కారంతో ఆ నిర్మాత‌కు సెటిల్‌చేసి, త‌నే ఆ సినిమా నిర్మాణాన్ని టేక‌ప్ చేశారు సాగ‌ర్‌. న‌రేశ్‌, మ‌నోచిత్ర జంట‌గా ప్రారంభించి, దాదాపు 80 శాతం షూటింగ్ చేశాక సాగ‌ర్ ద‌గ్గ‌ర డ‌బ్బులు అయిపోయాయి. మిగిలిన షూటింగ్ పూర్తిచేసి, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ చేయ‌డానికి డ‌బ్బులేదు. అప్పుడు ఆయ‌న క‌న్ను త‌మ ఇంట్లోని బంగారం, వెండిమీద ప‌డింది. అది వాళ్ల‌కు త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న సంప్ర‌దాయ సంప‌ద‌. 1870ల నాటి బంగ‌గారు నాణేలు, ఏడు వారాల న‌గ‌లు క‌లిపి ఒక‌టిన్న‌ర కేజీ బంగారాన్ని తీసుకువెళ్లి మార్వాడీ ద‌గ్గ‌ర కుదువ‌పెట్టారు.

ఇంకోసారి సాంగ్స్ రికార్డింగ్‌కు డ‌బ్బులులేక 25 వేల రూపాయ‌ల కోసం 15 కిలోల వెండిని బ్యాగ్‌లో పెట్టుకొని, అలాగే తీసుకువెళ్లి మార్వాడీ కొట్లో తాక‌ట్టు పెట్టారు. ఎలాగో సినిమా పూర్తిచేశాక డిస్ట్రిబ్యూట‌ర్స్ దొర‌క‌లేదు. దాంతో 'మావారి గోల' చిత్రాన్ని సొంతంగా రిలీజ్ చేశారు సాగ‌ర్‌. మొద‌ట్లోనే ఫైనాన్షియ‌ల్ టెన్ష‌న్‌తో డైరెక్ష‌న్ మీద స‌రిగా దృష్టిపెట్ట‌లేక‌పోవ‌డంతో ఆ సినిమా స‌రిగా రాలేదు. అది ఫ్లాప్ అవుతుంద‌ని ఆయ‌న ముందుగానే గ్ర‌హించారు. అనుకున్న‌ట్లే ఆ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. ఆర్థికంగా షేక్ అయిపోయారు సాగ‌ర్‌.

(ఫిబ్ర‌వ‌రి 17 సాగ‌ర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా...)