Read more!

English | Telugu

'వ‌సంత‌కోకిల‌'లో డాన్స్ చెయ్య‌లేక చెప్పాపెట్ట‌కుండా ఇంటికెళ్లిపోదామ‌నుకున్న సిల్క్ స్మిత‌!

 

క‌మ‌ల్ హాస‌న్‌, శ్రీ‌దేవి ప్ర‌ధాన పాత్ర‌ధారుగా బాలు మ‌హేంద్ర రూపొందించిన క్లాసిక్ ఫిల్మ్ 'మూండ్రం పిరై' (1982). తెలుగులో ఆ సినిమా 'వ‌సంత కోకిల‌'గా విడుద‌లై, ఇక్క‌డ కూడా క్లాసిక్ అనిపించుకుంది. ఈ సినిమాలో సిల్క్ స్మిత కూడా కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాకు ముందు ఆమె 'వండి చ‌క్రం' అనే త‌మిళ సినిమా చేశారు. నిజానికి అదే ఆమె తొలి సినిమా. ఈ సినిమా తెలుగులో శోభ‌న్‌బాబు హీరోగా 'ఘ‌రానా గంగులు' టైటిల్‌తో రీమేక్ అయ్యింది. 'మూండ్రం పిరై'లో క‌మ‌ల్‌, స్మిత‌పై ఓ పాట ఉంది. త‌మిళంలో "పొన్మేని ఉరువుదే" అనే ప‌ల్ల‌వితో ఆ పాట సాగుతుంది. 

ఆ పాట‌ను ఊటీలో చిత్రీక‌రించారు. స్మిత ఊటీ వెళ్ల‌డం అదే తొలిసారి. అయితే వారు ఊటీ వెళ్లిన సీజ‌న్ ఎలాంటిదీ అంటే.. కాళ్లూ, చేతులూ కొంక‌ర్లు పోయే డిసెంబ‌ర్ నెల‌లో. మామూలుగానే ఊటీలో ఉష్ణోగ్ర‌త చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అలాంటిది డిసెంబ‌ర్‌లో అక్క‌డి వాతావ‌ర‌ణం, చ‌లి ఎలా ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. అలాంటి అత్యంత శీత‌ల ప్ర‌దేశ‌మైన ఊటీలో, వైకాడు ప్రాంతంలో సాంగ్ పిక్చ‌రైజేష‌న్‌కు అంతా సిద్ధ‌మైంది. డైరెక్ట‌ర్ బాలు మ‌హేంద్ర తాను ఊహించుకున్న ఎఫెక్టు ఊహించిన‌ట్లుగా క‌చ్చితంగా వ‌స్తేనే కానీ షాట్ ఓకే చేసే వ్య‌క్తి కాదు. పైగా ఆ సినిమాకు ఆయ‌నే సినిమాటోగ్రాఫ‌ర్ కూడా. 

అంత‌కుముందు చాలా సినిమాల్లో ఊటీ అంద‌చందాల్ని చిత్రీకరించేశారు కాబ‌ట్టి, ఎవ‌రూ చిత్రీక‌రించ‌ని కొత్త లొకేష‌న్స్‌లో వైవిధ్యంగా పాట‌ను చిత్రీక‌రించాల‌ని బాలు మ‌హేంద్ర అనుకున్నారు. పాట‌ను మొత్తం మంచు నేప‌థ్యంలో తియ్యాలి. ఊటీలో కురిసే మంచు య‌థాత‌థంగా అత్యంత స‌హ‌జంగా స్ప‌ష్టంగా తెర‌పై క‌నిపించాల‌న్న‌ది ఆయ‌న తాప‌త్ర‌యం. దాని కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం ఆరున్న‌ర గంట‌ల‌కు ముందు, సాయంత్రం ఆరున్న‌ర దాటిన త‌ర్వాత షూటింగ్ జ‌ర‌ప‌డానికి టైమ్ ఫిక్స్ చేశారు.

ఇక స్మిత పాట్లు చూడాలి. పాట నాగ‌రాలో ప్రారంభ‌మ‌య్యేస‌రికి ఆమె కాళ్ల‌లోంచి వ‌ణుకు ప్రారంభ‌మ‌య్యేది - అక్క‌డి మంచుకు, చ‌లికి. పైగా కాళ్ల‌కు చెప్పులు లేకుండా నృత్యం చెయ్యాలి. అలా చేస్తుంటే, రాళ్లు కాళ్ల‌లోకి గుచ్చుకుపోయేవి. దాంతో ఆ చ‌లికి మ‌రింత బాధ అనిపించేది. ఆ బాధ‌కు ఏం చెయ్యాలో, ఎలా డాన్స్ చెయ్యాలో తెలియ‌క అవ‌స్థ‌ప‌డుతూ ఉంటే, ఓ వైపు నుంచి డాన్స్ డైరెక్ట‌ర్ సుంద‌రం మాస్ట‌ర్ "ఎన్న‌మ్మా స్మితా" అంటూ తొంద‌ర‌పెట్టేవారు. ఇక స్మిత ప‌రిస్థితి వ‌ర్ణ‌నాతీతం!

అప్ప‌టికి ఆమెకు త‌మిళం అస‌లు రాద‌నే చెప్పాలి. ఆయ‌న‌కు ఏం స‌మాధానం చెప్పాలో, ఎలా స‌మాధానం చెప్పాలో తెలీక బిక్క‌మొహం వెయ్యాల్సిన ప‌రిస్థితి. పైగా అక్క‌డి చ‌లి బాధ‌కి, రాళ్ల బాధ‌కి సుంద‌రం మాస్ట‌ర్ చెప్పేవిధంగా స్టెప్స్ వెయ్య‌డం ఎలా?  డాన్స్ చెయ్య‌డం ఎలా? ఎలాగో ప్రాణాల‌న్నీ ఉగ్గ‌బ‌ట్టుకొని తొలిరోజు షూటింగ్ అయ్యింద‌నిపించారు స్మిత‌.

షూటింగ్ నుంచి హోట‌ల్ రూమ్‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆమె ఆలోచించారు. "ఏలూరు నుంచి వ‌చ్చి ఇలా సినిమా న‌టిని అయ్యాను. న‌టిగా ఇన్ని క‌ష్టాలు ప‌డాలా? ఇన్ని క‌ష్టాలు ప‌డ‌టం నా వ‌ల్ల సాధ్య‌మ‌వుతుందా? ఈ క‌ష్టాల‌న్నీ ప‌డే బ‌దులు, మ‌ర్నాడు షూటింగ్‌కు హాజ‌రుకాకుండా, ఎవ‌రికీ చెప్పా చెయ్య‌కుండా మా ఊరెళ్లిపోతే బాగుండును క‌దా" అనుకున్నారు.

కానీ అంత‌లోనే త‌న‌ను తాను త‌మాయించుకుని, "ఈ సినీరంగ‌మే కాదు, ఏ రంగంలోనైనా మనం చేరాల‌నుకున్న గ‌మ్యం చేరాలంటే క‌ష్ట‌ప‌డ‌క త‌ప్ప‌దు. ఈ క‌ష్టానికి భ‌య‌ప‌డి పారిపోతే భ‌విష్య‌త్తులో మ‌నం ఏ ప‌ని చేప‌ట్టినా విజ‌యం సాధించ‌లేం" - అని త‌న‌కు తానే స‌మాధాన‌ప‌ర్చుకున్నారు. మ‌ర్నాడు షూటింగ్‌కు అంద‌రికంటే ముందుగా లొకేష‌న్‌కు చేరుకున్నారు. అప్ప‌టి ఆత్మ‌బ‌లం ఆమెకు కొండంత ధైర్యాన్నిచ్చి, ఆ పాట చిత్రీక‌ర‌ణ జ‌రిగిన ఎనిమిది రోజులూ ఆమెచేత న‌టింప‌జేసింది. ఆ పాట‌లో స్మిత నృత్యాన్ని చూసి క‌మ‌ల్ హాస‌న్‌, బాలు మ‌హేంద్ర ఇద్ద‌రూ ఎంతో మెచ్చుకున్నారు.

'మూండ్రం పిరై' విడుద‌లైన త‌ర్వాత స‌క్సెస్‌ఫుల్‌గా న‌డ‌వ‌డ‌మే కాకుండా, ప్ర‌త్యేకించి స్మిత‌కు ఎంతో పేరు ప్ర‌తిష్ఠ‌లు తెచ్చిపెట్టింది. ఎంద‌రో అభిమానుల్ని సంపాదించి పెట్టి, ఆమె సినీ కెరీర్‌లో అనూహ్య‌మైన మ‌లుపునీ తెచ్చిపెట్టింది. కేవ‌లం డాన్స‌ర్‌గానే కాక‌, ఆ సినిమాలో ఆమె పోషించిన ఆ పాత్ర‌ను ప‌రిస్థితుల ప్రాబ‌ల్యం వ‌ల్ల పొందిన మ‌నోవికారాన్ని అద్భుతంగా, అత్యంత స‌హ‌జంగా డైరెక్ట‌ర్ బాలు మ‌హేంద్ర తీర్చిదిద్ద‌డం వ‌ల్ల టాలెంటెడ్ యాక్ట‌ర్‌గానూ ఆమెకు విశేష‌మైన గుర్తింపు ల‌భించింది. అదే సినిమా హిందీలో 'స‌ద్మా' పేరుతో రిలీజై, స‌క్సెస్ అవ‌డంతో దేశ‌వ్యాప్తంగా స్మిత‌కు అభిమానులు ఏర్ప‌డ్డారు.

న‌టిగా అలాంటి క‌ష్టాలు ఓర్చిన స్మిత జీవితంలో త‌గిలిన దెబ్బ‌లు త‌ట్టుకోలేక 1996లో బ‌ల‌వ‌న్మ‌ర‌ణం పొంద‌డం ఎంతైనా బాధాక‌రం.