Read more!

English | Telugu

అమెరిక‌న్‌ను పెళ్లిచేసుకుంటాన‌న్న కుమార్తెకు జ‌గ‌ప‌తిబాబు ఏం చెప్పారు?

 

సీనియ‌ర్ న‌టుడు, నిన్న మొన్న‌టి దాకా ఫ్యామిలీ హీరోగా ఆడియెన్స్‌ను అల‌రించిన జ‌గ‌ప‌తిబాబు పెద్ద కుమార్తె మేఘ‌న 2015లో చాద్ బోవెన్ అనే అమెరిక‌న్‌ను వివాహం చేసుకుంది. అప్ప‌ట్లో ఈ వివాహం టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. జ‌గ‌ప‌తిబాబు ఓ అమెరిక‌న్‌ను అల్లుడిగా ఎలా అంగీక‌రించాడు? ఆయ‌న కావాల‌నుకుంటే త‌న బంధువుల్లో కానీ, బ‌య‌టి వాళ్ల‌లో కానీ ఎంత మంచి సంబంధం తెచ్చుకోగ‌ల‌డు? అన్న‌వాళ్లు చాలామందే ఉన్నారు. మేఘ‌న యు.ఎస్‌.ఎ.లో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ చ‌దువుతున్న‌ప్పుడు బోవెన్‌తో ప్రేమ‌లో ప‌డింది. 

"నేను ఓ అమెరిక‌న్‌ను ల‌వ్ చేశాను నాన్నా" అని మేఘ‌న చెప్పిన‌ప్పుడు చాలా మంది తండ్రుల్లా జ‌గ‌ప‌తిబాబు షాక‌వ‌లేదు. ఆయ‌న ఒక‌టే చెప్పారు - "ఇర‌వై ఏళ్ల త‌ర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకో. అప్పుడూ ఇలాగే బావుంటామ‌నిపిస్తే నాకు అభ్యంత‌రం లేదు" అని. త‌న ప్రేమ‌ను మేఘ‌న గ‌ట్టిగా న‌మ్మింది. దాంతో వాళ్లిద్ద‌రికీ హైద‌రాబాద్‌లోనే పెళ్లి చేశారు జ‌గ‌ప‌తిబాబు. పెళ్లికి చాద్ బోవెన్ త‌ర‌పున అత‌ని త‌ల్లితండ్రులు మాత్ర‌మే వ‌చ్చారు. జ‌గ‌ప‌తిబాబు త‌న బంధువుల్నీ, 20 ఏళ్లుగా స‌న్నిహితులైన వాళ్ల‌నూ.. మొత్తం ఓ 200 మందిని పిలిచారు.

ప‌బ్లిక్ ఫంక్ష‌న్‌లా కాకుండా త‌న ఫ్యామిలీ ఫంక్ష‌న్‌లాగే పెళ్లి వేడుక‌ను జ‌రిపారు. వ‌చ్చిన అతిథులు ఆ పూట వేడుక‌ను ఆస్వాదించి, వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించి వెళ్లారు. నిజానికి మేఘ‌న‌కు జ‌గ‌ప‌తిబాబు వాళ్ల బంధువుల నుంచి సంబంధాలు వ‌చ్చాయి. అయితే 'జ‌గ‌ప‌తిబాబు ఏం ఇస్తాడు?' అని వాళ్ల‌డిగారు. క‌ట్నం ఇవ్వ‌డానికీ, తీసుకోడానికీ ఆయ‌న వ్య‌తిరేకం. చాద్ బోవెన్ త‌ల్లితండ్రుల‌కు ఈ క‌ట్నాల గోల‌, లాంఛ‌నాల గోల లాంటివేమీ తెలీదు. జ‌గ‌ప‌తిబాబు నుంచి వాళ్లేమీ ఆశించ‌లేదు. ఆయ‌నే నోరు తెర‌చి, "ఏమైనా కావాలంటే చెప్పండి" అన‌డిగారు కూడా. వాళ్లేమీ వ‌ద్ద‌న్నారు.

"నిజానికి వాళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌నుకున్న‌ప్పుడు మ‌ధ్య‌లో ఇంకెవ‌రికీ అభ్యంత‌రం ఉండాల్సిన ప‌నిలేదు. కాక‌పోతే పెళ్లితో రెండు కుటుంబాల‌కు సంబంధం ఉంటుంది కాబ‌ట్టి ఆ పెళ్లి జ‌రిగితే వాళ్ల జీవితాలు బాగుంటాయా, వాళ్లు సంతోషంగా ఉంటారా అని ఆలోచిస్తే చాలు." అని చెప్పారు జ‌గ‌ప‌తిబాబు.