Read more!

English | Telugu

ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న రాశిని హీరోయిన్‌గా సెల‌క్ట్ చేసిన చిరంజీవి భార్య సురేఖ‌!

 

ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా ముత్యాల సుబ్బ‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'గోకులంలో సీత' (1997) బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి హిట్ట‌యింది. 11 సెంట‌ర్ల‌లో 100 రోజులు ఆడింది. ఆ సినిమాలో ప‌వ‌న్ జోడీగా రాశి న‌టించారు. ఆమెను ఆ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసింది సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ అంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌వ‌చ్చుకానీ, అది నిజం. అంత‌కుముందు రాశి హీరోయిన్‌గా న‌టించిన 'శుభాకాంక్ష‌లు' సినిమాని సురేఖ చూశారు. రాశి న‌ట‌న‌, అంద‌చందాలు ఆమెను బాగా ఆక‌ట్టుకున్నాయి. 

అప్ప‌టికే రాశి ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీకి తెలుసు. ఎలా అంటే.. 'గ్యాంగ్ లీడ‌ర్' హిందీ రీమేక్ 'ఆజ్ కా గూండారాజ్‌'లో చిరంజీవి అన్న కుమార్తెగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించారు రాశి. అట్లా ఆమె ఫ్యామిలీ చిరంజీవికి తెలుసు. 

చిరంజీవికి చెన్నైలోనూ ఇళ్లున్నాయి. ఒక‌సారి భార్య‌ను తీసుకుని చెన్నై వ‌చ్చారు చిరంజీవి. అప్పుడు రాశి వాళ్లు చెన్నైలోనే ఉంటున్నారు. చిరంజీవిగారు ర‌మ్మ‌న్నారంటూ రాశి వాళ్ల నాన్న‌కు ఫోన్ వ‌చ్చింది. ఆయ‌నే పిలుస్తున్నార‌నుకొని, త‌న ఫొటో ఆల్బ‌మ్ తీసుకుని, తండ్రితో పాటు చిరంజీవి వాళ్లింటికి వెళ్లారు రాశి. అక్క‌డ‌కు వెళ్లాక తెలిసింది, త‌మ‌ను పిలిపించింది చిరంజీవి కాద‌నీ, ఆయ‌న భార్య సురేఖ అనీ. ఆమె రాశి ఆల్బ‌మ్ చూశారు. అవ‌న్నీ సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన దుస్తుల్లో ఉన్న‌వే. అలా కాద‌నీ, వెస్ట్ర‌న్ వేర్‌తో ఒక ఫొటో షూట్ చేద్దామ‌న్నారు సురేఖ‌. అలా మోడ్ర‌న్ డ్ర‌స్సుల‌తో రాశితో ఫొటో షూట్ చేశారు. 

ఆ ఫొటోలు చూశాక త‌ను అనుకున్న పాత్ర‌కు రాశి స‌రిపోతుంద‌ని ఆమెకు అనిపించింది. "మ‌న క‌ల్యాణ్ ప‌క్క‌న ఈ అమ్మాయి బాగుంటుంది" అని డైరెక్ట‌ర్ ముత్యాల సుబ్బ‌య్య‌కు రిక‌మెండ్ చేశారు సురేఖ‌. అలా 'గోకులంలో సీత' మూవీలో టైటిల్ రోల్ చేసి, ఆక‌ట్టుకున్నారు రాశి.